
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ళ వానల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రభావం పప్పు ధాన్యాల ధరలపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. పప్పు ధాన్యాల నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని టోకు వ్యాపారులు, మిల్లర్లను ఆదేశించింది.
అంతేకాకుండా దిగుమతులపై ప్రత్యేకంగా దృషి పెట్టింది. దేశంలో పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 1.67 కోట్ల హెక్టార్లు కాగా, గత ఏడాది 1.27 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. కంది, మినుము అధికంగా సాగయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో ఈ నష్టం మరింత పెరుగనుంది. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది కందిపప్పు ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇది గత ఏడాది ఉత్పత్తి కంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. మినప ఉత్పత్తితోనూ 3 నుంచి 5 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రేడ్–1 కందిపప్పు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కిలో రూ.125 నుంచి రూ.135 దాకా పలుకుతోంది. మిగతా పప్పుల ధరలు సైతం 8 నుంచి 10 శాతం వరకూ పెరిగాయి. దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం పప్పు ధాన్యాల స్టాక్ హోల్డర్లు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం తేలి్చంది. వివిధ పోర్టుల్లో ఉన్న నిల్వలను పరిశీలించింది. ఈ వివరాలను నాఫెడ్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఎక్కడైనా నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించింది. కంది, పెసర, మినప పప్పుల ధరలు పెరగకుండా చూడాలని అధికారులకు కేంద్ర ఆహార శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment