
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ‘దిశ’ కేంద్రం శుభవార్త తెలిపింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు.
చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్లు సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల సాధికారతను సాధించేలా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment