కోహిమా/గువాహటి: సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958ను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వివేక్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్ గోయల్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ కమిటీలో నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తోపాటు అస్సాం రైఫిల్స్(నార్త్) ఇన్‌స్పెక్టర్ జనరల్, సీఆర్‌పీఎఫ్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నాగాలాండ్‌కు కల్లోలిత ప్రాంతంగా గుర్తింపును కొనసాగించడం/ రాష్ట్రం నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించడంపై స్పష్టత వస్తుందన్నారు. ఇటీవల మోన్ జిల్లాలో భదత్రాబలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందడంతో ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించాలనే డిమాండ్ ఊపందుకుంది. కాల్పులకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment