మెట్రోలో ‘పీత’లాటకం! | Chaos in metro after live crabs fall out of woman's bag | Sakshi
Sakshi News home page

మెట్రోలో ‘పీత’లాటకం!

Published Mon, Sep 30 2024 11:25 AM | Last Updated on Mon, Sep 30 2024 11:33 AM

Chaos in metro after live crabs fall out of woman's bag

మహానగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణికులు చాలావరకు మోత బరువులు లేకుండా, నీటుగా తయారై వెళ్తుంటారు. చెవుల్లో హెడ్‌ఫోన్లు, చేతుల్లో స్మార్ట్‌ఫోన్లతో ఎవరి లోకంలో వాళ్లు బిజీగా ఉంటారు. అలాంటి మెట్రోలో ఒక్కసారిగా డజను దాకా పీతలు ప్రత్యక్షమయ్యాయి. ఆకాశంలోంచి కాకపోయినా ఒక ప్రయాణికురాలి ప్లాస్టిక్‌ సంచి నుంచి కింద పడ్డాయి. స్వేచ్ఛ దొరికిందే తడవుగా తలోవైపు చకచకా పరుగులు తీశాయి. దాంతో సదరు మహిళకు గాభరాతో మెట్రో రైలు తలుపు వైపు పరుగెత్తింది. సాయం కోసం అటు ఇటూ చూసింది. చిరిగిన సంచినే వాటిపై గట్టిగా అదిమిపెడుతూ ఆపసోపాలు పడింది. 

ఇదంతా చూస్తున్న సూటు బూటు వేసుకున్న ఓ పెద్దాయన ఆమెకు సాయంగా రంగంలోకి దిగాడు. ఎడమ చేత్తో ఫోను చూస్తూనే కుడి చేత్తో పీతల వేట మొదలు పెట్టాడు. ఆయనకు మరో ‘హెడ్‌ఫోన్‌’ ప్రయాణికుడు, మరో వ్యక్తి తోడయ్యారు. ఇంకొకరు పెద్ద ఖాళీ సంచి అందించారు. అంతా కలిసి ఒక్కో పీతను ఒడుపుగా ఒడిసిపట్టి సంచిలో వేశారు. అయినా పీతలు పట్టుకున్న వాళ్లను కొండీలతో కరుస్తూ పారిపోయేందుకు ప్రయతి్నంచాయి. 

చివరికి అంతా కలిసి అన్ని పీతలనూ విజయవంతంగా సంచీలో వేశారు. మెట్రోలో ఈ పీతల హడావిడిని ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే ఏకంగా కోటీ 15 లక్షల మందికి పైగా చూశారు. లెక్కలేనన్నిసార్లు షేర్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుప్పలు తెప్పలుగా లైక్‌లు, కామెంట్లూ వస్తున్నాయి. ‘సూటూ బూటు నీటుగాళ్లు తిరిగే మెట్రోలో జనం సాయానికి ఇంతగా జనం ముందుకురావడం గ్రేట్‌’ అని ఒకరు, ‘పీతలు భలే తాజాగా ఉన్నాయి. వండుకు తింటే నా సామిరంగా..’ అని ఇంకొకరు కామెంట్‌ పెట్టారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందన్నది మాత్రం తెలియదు!  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement