ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మళ్లీ నెగ్గాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న జనాదరణే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంచుకోట ఛత్తీస్‌గఢ్ తమ చేజారిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. భూపేశ్ బఘేల్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారంతా తమనే ఆదరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్టతో సహా ఇతర చిన్నాచితక పార్టీలు సైతం అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కొన్ని సీట్లయినా గెలుచుకొని కింగ్‌మేకర్ కావాలని చిన్న పార్టీలు ఆరాటపడుతున్నాయి.
కాంగ్రెస్ అవినీతే బీజేపీ అస్త్రం
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2018లో అధికారం లభించింది. విపక్ష బీజేపీ మొదట్లో బలహీనంగా ఉన్నట్లు కనిపించినా ఎన్నికలు సమీపించేకొద్దీ బలం పుంజుకుంటోంది. అధికార కాంగ్రెస్‌కు సవాలు విసురుతోంది. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, కుంభకోణాలు, బుజ్జగింపు రాజకీయాలు, మత మారి్పడులను ప్రధానంగా తెరపైకి తీసుకొస్తూ బఘేల్ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఏడాది క్రితం వరకూ బల్లగుద్ది మరీ చెప్పిన విశ్లేషకులు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. బీజేపీకి విజయావకాశాలు మెరుగయ్యాయని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార వ్యూహం మార్చారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు. మోదీకి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారి తమకు లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు.
చదవండి: శరద్ పవార్‌పై అసోం సీఎం వ్యంగ్యాస్త్రాలు
మోదీ, షా మంత్రాంగం
ఛత్తీస్‌గఢ్‌పై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. మోదీ గత మూడు నెలల్లో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా తరచుగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతిని ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే బఘేల్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి, గెలుపు దిశగా నడిపించడానికి మోదీ, షా ప్రాధాన్యం ఇస్తున్నారు.
జనాభాలో 32 శాతం గిరిజనులే
రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతామని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో సర్వ ఆదివాసీ పార్టీ, గోండ్వానా గణతంత్ర పార్టీ కూడా పోటీ పడుతున్నాయి.
రాష్ట్ర జనాభాలో 32 శాత మంది గిరిజనులు ఉన్నారు. వారి ఓట్లపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 68 సీట్లు గెలుచుకొని జయకేతనం ఎగురవేసింది. బీజేపీకి కేవలం 15 సీట్లు లభించాయి. మాజీ సీఎం అజిత్ జోగీ స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే)కు ఐదు సీట్లు దక్కాయి. బీఎస్పీ రెండు స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో 75 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో బరిలో దిగనున్న తమ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదలచేసింది. ఆదివారం 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా బుధవారం 53 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదలచేసింది. భత్‌గావ్ నుంచి పరాస్‌నాథ్ రాజ్‌వాడే, కట్‌ఘోరా నుంచి పురుషోత్తం కన్వర్, బెల్తారా నుంచి విజయ్ కేసర్‌వాణి, అకల్‌తారా నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర సింగ్, బిల్హా నుంచి సియారామ్ కౌశిక్ బరిలో నిలుస్తున్నారు.
14 ఎస్‌టీ, ఆరు ఎస్‌సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం విడుదలైన అభ్యర్థుల జాబితా ప్రకారం ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్.. పటాన్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి దఫా, నవంబర్ 17న రెండో దఫాలో పోలింగ్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment