
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజనకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమ కోహ్లిల ధర్మాసనం ముందు ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయవాదులు ప్రశాంత్‌భూషణ్, రమేశ్ అల్లంకి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
2014లో ఏపీ విభజన పూర్తికాలేదని, విభజన చట్టం కొట్టేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్, మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు తెలిపారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రతివాదులకు నోటీసులు జారీచేశారని, కానీ ఆ పిటిషన్లపై ఇప్పటివరకు విచారణ జరగలేదని చెప్పారు. 2019లో ఉండవల్లి ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ దాఖలు చేసినా ఇప్పటివరకు జాబితాలోకి రాలేదని తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో తమ ప్రేయర్‌ను సవరిస్తూ పిటిషన్ వేశామన్నారు. 2014లో ఏపీ విభజన జరిగింది.. తప్పోఒప్పో ఏపీ విభజన జరిగిపోయిందని, భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు సూచించాలని కోరామన్నారు. అదే సమయంలో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థికంగా సాయం చేయాలని సవరణ పిటిషన్ వేసినట్లు వివరించారు. తక్షణమే విచారించాలని తాము కోరడం లేదని, ఏదో ఒకరోజు తేదీని నిర్ణయించాలని న్యాయవాదులు అభ్యర్థించారు. సవరణ పిటిషన్ విచారణకు తేదీ కేటాయిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.