
సాక్షి,ముంబై: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు ఇప్పటి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్టే ఇచ్చారు. తాజాగా శిందే తీసుకున్న నిర్ణయంతో వివిధ రంగాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దు కావడానికి ఒకరోజు ముందు నిర్వహించిన (చివరి) మంత్రిమండలి సమావేశంలో ఔరంగాబాద్ పేరు సంజాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్‌గా నామకరణం చేసే ప్రతిపాదనను ఉద్ధవ్ ఠాక్రే ఆమోదించారు. దీంతో ఔరంగాబాద్ పట్టణ వాసులు అప్పట్లో ఆనందోత్సవాలు జరుపుకున్నారు.
కానీ, తాజాగా శిందే తీసుకున్న నిర్ణయంతో పట్టణవాసుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో మళ్లీ సంబాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు దిగాల్సి వస్తుందని ప్రజలు సంకేతాలిస్తున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగిన ఏక్‌నాథ్ శిందే గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడంతో శివసేనపై తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి పొత్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఆఘాడి ప్రభుత్వం కూలిపోవడం, శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పదవీ బాధ్యతలు చేపట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే హయాంలో మంత్రిమండలిలో తీసుకున్న కీలక నిర్ణయాలపై శిందే దృష్టి సారించారు.
అందులో గత అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న వివాదస్పద ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించారు. కానీ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శిందే, ఫడ్నవీస్ కలిసి ఇరు నగరాలకు కొత్తగా చేసిన నామకరణానికి స్టే ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై పునరాలోచిస్తామని వెల్లడించారు. శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావుత్ తీవ్రంగా ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే ఎవరిని లెక్కచేయకుండా హిందూత్వానికి కట్టుబడి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించారు. కానీ, శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ నిర్ణయానికి స్టే ఇచ్చి నకిలీ హిందూత్వవాదులని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నకిలీ హిందూత్వవాదులను ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు.