ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌తో పాటు రాజస్తాన్‌లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి...
బీజేపీ బలాలు...
- ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది.
- 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది.
- కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది.
- అయితే గతంలో రమణ్‌సింగ్‌లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు.
అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం
- బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్‌గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది.
- సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది.
- పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచ్చితంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు.
- వీటికి తోడు ఛత్తీస్‌గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు.
- అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి.
బరిలోకి గిరిజన పార్టీ
ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పార్టీగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్‌ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ కీలకాంశాలు
- వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు.
- కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పార్టీలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు.
- డిప్యూటీ సీఎం కేపీ సింగ్‌దేవ్ రూపంలో భగేల్‌కు సొంత పార్టీలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు.
- ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment