
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా.