శరవేగంగా శ్రీనగర్‌–లద్దాఖ్‌ భారీ టన్నెళ్ల నిర్మాణం | Construction Of Strategic Roads Connecting Srinagar To Ladakh | Sakshi
Sakshi News home page

శరవేగంగా శ్రీనగర్‌–లద్దాఖ్‌ భారీ టన్నెళ్ల నిర్మాణం

Published Tue, Sep 28 2021 4:16 AM | Last Updated on Tue, Sep 28 2021 8:57 AM

Construction Of Strategic Roads Connecting Srinagar To Ladakh - Sakshi

జోజిలా ప్రాజెక్టు 

శ్రీనగర్‌ సోనామార్గ్‌ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్‌–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్‌–మోర్, జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి.

అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గుర్జిత్‌సింగ్‌ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. 

ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే 
ప్రస్తుతం శ్రీనగర్‌ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్‌ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది.

అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్‌–మోర్‌ టన్నెల్‌ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి.

తగ్గనున్న రవాణా భారం... 
సోనామార్గ్‌ నుంచి కార్గిల్‌ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్‌–లేహ్‌ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్‌–మోర్‌ టన్నెల్‌ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్‌ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది.

రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్‌ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్‌ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.  ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్‌ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. 

హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు 
సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్‌ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్‌ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది.

పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్‌ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్‌ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్‌ లైటింగ్, మెసేజ్‌ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement