Infrastructure Development Corporation
-
శరవేగంగా శ్రీనగర్–లద్దాఖ్ భారీ టన్నెళ్ల నిర్మాణం
శ్రీనగర్ సోనామార్గ్ నుంచి సాక్షి ప్రతినిధి: భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కే తలమానికంగా నిలిచే శ్రీనగర్–లద్దాఖ్‌ను కలిపే వ్యూహాత్మక రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఊపిరిలూదడంతోపాటు స్థానిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చేపట్టిన జెడ్–మోర్, జోజిలా టన్నెల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న రెండు టన్నెళ్ల నిర్మాణ పనులను మంగళవారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించనున్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్జిత్‌సింగ్ కాంబో సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత దారులు ఏడాదిలో 5 నెలలు మూతే ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లేహ్, లద్దాఖ్‌లను కలిపే రహదారులు రవాణాపరంగా, ఆర్థికపరంగా చాలా క్లిష్టంగా ఉన్నాయి. శ్రీనగర్ నుంచి లేహ్‌కు వెళ్లే రహదారిని ఏడాదిలో 5 నెలలపాటు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు తెరిచి ఉంచే పరిస్థితులు లేవు. తీవ్రమైన హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలకు వీల్లేకపోవడంతో సైనిక వాహనాల రాకపోకలకు సమస్యగా మారింది. అదీగాక ప్రత్యా మ్నాయ మార్గాలన్నీ చైనా, పాకిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉండటంతో వాటిని అభివృధ్ధి చేసే పరిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం ఆవశ్యకమైంది. ఇందులో భాగంగానే జొజిలా, జెడ్–మోర్ టన్నెల్ నిర్మాణాలు తెరపైకి వచ్చాయి. తగ్గనున్న రవాణా భారం... సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లద్దాఖ్‌కు రెండు సొరంగ మార్గాలను కేంద్రం సుమారు రూ. 7 వేల కోట్లతో నిర్మిస్తోంది. వాటితో శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 6.5 గంటలుSతగ్గుతుంది. ఇందులో జెడ్–మోర్ టన్నెల్ వ్యయం రూ. 2,300 కోట్లుకాగా జోజిలా వ్యయం రూ.4,600 కోట్లు. జోజిలా ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద 14.15 కి.మీ. మేర టన్నెల్, 18.5 కి.మీ. మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఉపయోగపడేలా నిర్మించే టన్నెల్ మార్గం ఎత్తు 7.57 మీటర్లుగాను, వెడల్పు 9.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే మూడు గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం టన్నెల్ తవ్వకం పనులు సుమారు 500 మీటర్ల వరకూ పూర్తయ్యాయి. దీన్ని 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆసియాలోనే అతిపెద్ద అండర్ టన్నల్‌గా చరిత్రకు ఎక్కనుంది. హైటెక్నాలజీతో మేఘా ప్రాజెక్టు సాధారణ రోడ్డుకు భిన్నంగా జోజిలా ప్రాజెక్టును ఎంఈఐఎల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి పాలిస్టైరిన్ వినియోగిస్తోంది. మంచు కారణంగా రోడ్డు పాడవకుండా ఈ పాలిస్టైరిన్ కాపాడుతుంది. హిమాలయాల్లో ఈ టెక్నాలజీతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రోడ్డు ఉంటుంది. పాలి స్టైరిన్‌తోపాటు రోడ్డుపై మంచు చేరకుండా స్నోగ్యాలరీలను నిర్మిస్తున్నారు. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన భద్రతా వ్యవస్థతో ఎంఈఐఎల్ ఈ మార్గాన్ని చేపడుతోంది. ఇందులో ఎమర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. -
పట్టణ పేదలకు ఉచితంగా 10లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి : పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బీ–అర్బన్ లోకల్ బాడీస్) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించి అనంతరం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీటిడ్కో నిర్ణయించింది. మొదటి దశలో ఇలా.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మొదటి దశ కింద 10 లక్షల వరకు ఇళ్లు నిర్మించాలని ఏపీటిడ్కో సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ఇళ్ల కోసమే పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 2 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. విజయవాడలో లక్ష ఇళ్లు, గుంటూరులో 70 వేలు, తిరుపతిలో 60వేల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్రం మొత్తం మీద పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని టిడ్కో గుర్తించింది. అన్ని వసతులతో 10వేల ఎకరాల్లో నిర్మాణం ఒక ఎకరా విస్తీర్ణంలో జి+3 విధానం కింద 100 యూనిట్లను అన్ని వసతులతో నిర్మించాలన్నది ప్రణాళిక. ఒక్కో యూనిట్‌ను 330 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఆ గృహ సముదాయాల వద్ద కమ్యూనిటీ హాలు, పార్కు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల గృహాల కోసం 10వేల ఎకరాలు అవసరమని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అందుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియను రెవెన్యూ శాఖ ఇప్పటికే చేపట్టింది.భూసేకరణ, సమీకరణ, దాతల నుంచి సేకరించడం ద్వారా అవసరమైన భూమిని కూడా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రారంభానికి భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది నాటికి లబ్ధిదారుల పేరిట ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో ఒక ఎకరా భూమిని ఉమ్మడిగా 100 మంది లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ టిడ్కో ఎండీ దివాన్ మైదీన్ ‘సాక్షి’కి తెలిపారు. మహిళల పేరిటే పట్టాలు ఇస్తారు. అనంతరం ఆ భూముల్లో ఏపీటిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. అందుకు రివర్స్ టెండరింగ్ విధానంలో బిడ్లు ఆహ్వానిస్తారు. అలాగే, ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యమని ఉన్నతాధికారులు చెప్పారు. ప్రణాళికలు సిద్ధం గతంలోని టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు కూడా తమ వాటాగా డబ్బులు చెల్లించాలనే విధానం రూపొందించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.2.65 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.3.65 లక్షలు, 430 చ.అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.4.65 లక్షలు లబ్ధిదారులు చెల్లించాలని నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం పేదలకు పూర్తి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ విధానమని అధికారులకు స్పష్టంచేశారు. భారీ వ్యయమవుతుందని అధికారులు చెప్పినా ఎంతైనా సరే ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తేల్చి చెప్పారు. దాంతో పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ టిడ్కో అధికారులు ప్రణాళిక రూపొందించారు. -
బెంగళూరు విమానాశ్రయంలో ఫెయిర్‌ఫ్యాక్స్ పాగా
కంపెనీ చేతికి జ్యూరిక్ ఎయిర్పోర్ట్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (బీఐఏఎల్) ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా పెంచుకుంటోంది. బీఐఏఎల్‌లో మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఉన్న జ్యూరిక్ ఎయిర్పోర్ట్ తనకున్న 5 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. డీల్ విలువ (పన్నులకు ముందు) రూ.318 కోట్లు. దీంతో ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరుకోనుంది. తద్వారా మెజారిటీ వాటాదారుగా నిలువనుంది. ఇటీవలే విమానాశ్రయంలో 33% వాటాను రూ.2,149 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అమ్ముతున్నట్టు జీవీకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌తో జీవీకే వాటా 10 శాతానికి పరిమితం అవుతోంది. కాగా, 2009లో జ్యూరిక్ ఎయిర్పోర్ట్ బీఐఏఎల్‌లో 12 శాతం వాటాను జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయించింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని బీఐఏఎల్ నిర్వహిస్తోంది. విమానాశ్రయంలో ప్రస్తుతం సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కు 26 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 13 శాతం వాటా ఉంది. కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు.