న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, మరికొన్ని వారాల్లో టీకా అందుబాటులోకి రావొచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శుక్రవారం వర్చువల్‌గా జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, తీవ్రమైన వ్యాధులతో బాధపడ్తున్న వృద్ధులు.. మొదలైన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
టీకా ధరపై అనేక ప్రశ్నలు వస్తున్నాయని, అది సహజమేనని, అయితే, ప్రజారోగ్యానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌లో రాష్ట్రాలను సంపూర్ణంగా భాగస్వాములను చేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుగా ‘కోవిన్’ అనే సాఫ్ట్‌వేర్‌ను భారత్ సిద్ధం చేసిందని వెల్లడించారు. కరోనా మహమ్మారితో దేశంలో నెలకొన్న పరిస్థితులు, టీకా సంసిద్ధత, పంపిణీ, టీకా ధర తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. ప్రధానంగా 8 టీకాలు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయని, భారత్‌లో వాటి ఉత్పత్తికి హామీ లభించిందని ప్రధాని తెలిపారు. భారత్‌లోనూ మూడు టీకా ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
ఇటీవల పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లోని టీకా ప్రయోగశాలలను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రయోగాలు కచ్చితంగా విజయవంతమవుతాయని అక్కడి శాస్త్రవేత్తలు గట్టి నమ్మకంతో ఉన్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు ప్రయోగదశల్లో ఉన్నప్పటికీ.. చవకగా, సమర్ధవంతంగా పనిచేసే టీకా కోసమే అంతా ఎదురు చూస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా భారత్ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రధాని పునరుద్ఘాటించారు. పలు దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల భారత్‌లోనూ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని కోరారు.
వ్యాక్సిన్ సిద్ధమవుతున్న దశలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ముప్పును కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, హర్షవర్ధన్‌తో పాటు కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్ చౌధురి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఎంసీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్.. తదితరులు హాజరయ్యారు. కరోనా తరహా మహమ్మారులు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశముందని, దేశ విధాన నిర్ణేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు.
మొదట కోటి మంది వైద్య సిబ్బందికి..
కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అఖిలపక్ష భేటీలో ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చింది. మొదట టీకాను దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని సుమారు కోటి మంది వైద్య సిబ్బందికి ఇస్తామని వెల్లడించింది. ఆ తరువాత, కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, సాయుధ దళాలు, మున్సిపల్ సిబ్బంది తదితర రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని పేర్కొంది.
కరోనా కేసులు 95.71 లక్షలు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య శుక్రవారానికి 95.71 లక్షలకు చేరింది. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 90.16 లక్షలు దాటింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 94.20 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 36,559 అని, వ్యాధి కారణంగా ఒక్కరోజులో మరణించిన వారి సంఖ్య 540 అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 1,39,188 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కోవిడ్–19 మరణాల శాతం భారత్‌లో ప్రస్తుతం 1.45 గా ఉంది. డిసెంబర్ 3 వరకు 14,47,27,749 శాంపిల్స్‌ను పరీక్షించామని ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment