సాక్షి, ఢిల్లీ: రాబోయే కొన్నినెలలు జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోను. ఎందుకంటే.. నేను భగత్ సింగ్ మార్గాన్ని అనుసరించే వ్యక్తి. తెలుసు కదా.. దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించాడు!. లిక్కర్ పాలసీ కేసులో.. సీబీఐ విచారణకు వెళ్లబోయే ముందు మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్ ఇది.
ఊహించినట్లుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణ పేరిట హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించుకున్న సీబీఐ.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది. ఆపై ఆయన అరెస్ట్‌ను ప్రకటించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన వ్యవహారంలో సిసోడియాదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న దర్యాప్తు సంస్థ.. ఏ1 నిందితుడిగా ఆయన పేరు ప్రకటించింది. లిక్కర్ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారని అభియోగాలు ఆయనపై నమోదు చేసింది.
బ్యూరోక్రాట్స్ స్టేట్‌మెంట్ ఆధారంగానే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా సీబీఐ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ను విధించారు. ఇక మనీశ్ సిసోడియా ఆయన అరెస్ట్‌ను ఓ అధికారి ధృవీకరించారు. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిపారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఛార్జిషీట్‌లో ఏడుగురు నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ.. సిసోడియా పేరు మాత్రం చేర్చలేదు. అయినప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
అయితే ఢిల్లీ ఆర్థిక మంత్రి అయిన సిసోడియా.. బడ్జెట్ రూపకల్పనకు వారం గడువు కావాలంటూ సీబీఐని అభ్యర్థించారు. దీంతో అందుకు అనుమతించింది దర్యాప్తు సంస్థ. ఇక.. సిసోడియా అరెస్ట్ అవుతారంటూ ముందునుంచే ప్రచారం జరిగింది. దీంతో ఆయన అరెస్ట్‌కు సిద్ధమేనంటూ ఈ ఉదయం ప్రకటించారు. మరోవైపు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం సిసోడియాకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు.
సుమారు 8 గంటలపాటు సిసోడియాను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో ఆయన్ని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. పలు సందర్భాల్లో చేసిన ఫోన్ కాల్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్ సిసోడియా వివరణలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతోనే అరెస్టు చేశామని అంటున్నారు. కీలకమైన సమాచారం సిసోడియా నుంచి రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరమని అన్నారు. ఈ తరుణంలో రేపు ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి.. సీబీఐ కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2021 మద్యం పాలసీ రూపకల్పనలో.. మద్యం కంపెనీల ప్రమేయం ఉందని సీబీఐ చెబుతోంది. ‘‘సౌత్ గ్రూప్’’ అనే పేరిట లిక్కర్ లాబీయింగ్ నడిచిందని.. రూ. 100 కోట్ల డబ్బు చేతులు మారాయని వెల్లడించింది. ఈ విధానం వల్ల కంపెనీలకు 12 శాతం లాభం వచ్చిందని, అందులో 6 శాతం మధ్య దళారుల ద్వారా ప్రభుత్వోద్యోగులకు చేరిందని తెలిపింది. ఇక మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ ప్రారంభించింది. ఇప్పటిదాకా లిక్కర్ స్కాంకు సంబంధించి 12 మందిని సీబీఐ, ఈడీ అరెస్ట్ చేశాయి. రాజకీయంగానూ ఈ స్కాం ప్రకంపనలు సృష్టించింది.
చదవండి: బీజేపీ, ఆప్.. ఓ మద్యం కుంభకోణం
Comments
Please login to add a commentAdd a comment