న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్‌లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు.
గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు.
డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు..
వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి.
దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్(యూహెచ్‌ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు.
వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్‌ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment