ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఓవైపు శివసేన నేృత్వంలోని సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోయింది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే క్యాంపులో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే విధంగా మహారాష్ట్రలో తమదే అధికారమంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు మాత్రమే తాము ప్రతిపక్ష హోదాలో ఉండబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
తాజాగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించడంపై ఏక్‌నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది బాలా సాహెబ్ ఠాక్రే విజయమని అన్నారు. ఈ మేరకు ఏక్‌నాథ్ షిండే ట్విటర్‌లో స్పందించారు. ‘ఇది హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ విజయం. ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆలోచనల విజయం’ అని షిండే మరాఠీలో ట్వీట్ చేశారు. దీనికి #realshivsenawins అనే హ్యష్‌ట్యాగ్ జతచేశారు.
हा वंदनीय हिंदुहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या हिंदुत्वाचा आणि धर्मवीर आनंद दिघे साहेबांच्या विचारांचा विजय..!#realshivsenawins
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 27, 2022
కాగా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేయడంతోపాటు శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని సవాల్ చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనర్హత పిటిషన్లపై జూలై 12 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
చదవండి: రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment