లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీసులకు, దుండగులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు గాయపడ్డాడు. ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్థరాత్రి తల్కతోరా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు నిందితులు పోలీసులను చూసి, తమ బైక్‌లను వెనక్కుతిప్పి పారిపోయారు. దీంతో పోలీసు బృందం వారిని వెంబడించింది. ఆలంనగర్ రైల్వే లైన్ సమీపంలో నిందితుల్లో ఒకడు బైక్‌పై నుంచి జారి కిందపడిపోయాడు. వెంటనే అతను పిస్టల్ తీసి, పోలీసులపైకి రెండు రౌండ్లు కాల్చాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఒక నిందితుని కాలికి బుల్లెట్ తగిలి గాయపడి, పోలీసులకు పట్టుబడ్డాడు. మరో బైక్‌పై వెళుతున్న నిందితులిద్దరినీ కూడా పోలీసులు వెంబడించి విజయవంతంగా పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పోలీసులు ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు, రెండు వినియోగించిన కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
Comments
Please login to add a commentAdd a comment