
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కుంట పరిధిలోని కన్హాయిగూడ– గోపాండ్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, భద్రతా బలగాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు సుకుమా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ ధ్రువీకరించారు. డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం గాలింపు చేపట్టగా, భద్రతా బలగాలను గమ నించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు తేరుకుని జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో కుంట ఎల్‌ఓఎస్ కమాండర్ కవ్వాసి ఉంగా, జన మిలీషియా కమాండర్ సోయం బజారి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కవ్వాసిపై రూ.5 లక్షలు, సోయంపై రూ.లక్ష రివార్డు ఉందని పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు.