బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేడీఎస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. ఏది ఏమైనా తాను కాషాయం పార్టీతో కలిసే ప్రసక్తే ఉండబోదని తేల్చేశారు.
బీజేపీ, జేడీఎస్‌లకు సిద్ధాంతాలు లేవు. హేతుబద్ధత లేదు. ఒకవేళ బీజేపీ వాళ్లు నన్ను రాష్ట్రపతిని చేసినా.. ప్రధానిని చేసినా.. వాళ్లతో కలిసే వెళ్లే ప్రసక్తే ఉండదు. బీజేపీ, ఆరెస్సెస్‌లకు నేను దూరం. కనీసం నా శవం కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో వెళ్లదు అని పేర్కొన్నారు. సోమవారం రామనగర జిల్లా మగడిలో జరిగిన ఓ పార్టీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జనతా దళ్(సెక్యులర్), ఇతరులు.. అధికారం కోసం బీజేపీతో కలిసి వెళ్తారన్న సిద్ధారామయ్య.. జేడీఎస్ కూడా సిద్ధాంతాలు లేని పార్టీనే అని తేల్చేశారు. అధికారం కోసం వాళ్లు ఎవరితో అయినా అంటకాగుతారని విమర్శించారు. అలాంటి వాళ్లకు ఆత్మ గౌరవం అనేది ఉంటుందా? అని నిలదీశారాయన.
‘‘బీజేపీ నేను హిందూ వ్యతిరేకినంటూ ప్రచారం చేస్తోంది. బీజేపీ నేత రవి నన్ను సిద్ధారాముల్లా ఖాన్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. కానీ, గాంధీజీనే నిజమైన హిందువు. అలాంటి గాంధీని చంపిన గాడ్సేను ఆరాధించే హిందువులు వాళ్లు’’ అంటూ వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఆహార భద్రత ఉండేదని, కానీ, బీజేపీ పాలనలో అది కనిపించడం లేదని ఆరోపించారాయన.
Comments
Please login to add a commentAdd a comment