
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు కేంద్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం నగరంలోని మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా బంగ్లాపై దాడి చేశారు. మరో విషయం ఏంటంటే ఈ కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా సీసీబీ ఏజెంట్లు దాడుల ప్రారంభిన నాటి నుంచే కనిపించకుండా పోయాడు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిపై కేసులు నమోదు చేయగా, తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక సెర్చ్ వారెంట్ పొందిన తర్వాతనే హెబ్బాల్ సమీపంలోని ఆదిత్య అల్వా 'హౌస్ ఆఫ్ లైఫ్' అని పిలువబడే ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం)
నాలుగు ఎకరాలలో విస్తరించిన ఈ బంగ్లాను ఆదిత్య అల్వా పార్టీలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన వారిలో సినీ నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ గుమస్తా బి.కె.రవిశంకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment