
చండీగఢ్: పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్–ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్‌పీజీ) విసిరినట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి కిటికీలు, ఫర్నీచరు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కాదని అన్నారు. దీంతో సీనియర్ పోలీసు సుపరిడెంట్ ఆఫీసర్‌తో కూడిన బృందం కార్యాలయం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు.
ఇక దీనికి సంభంధించి మొహాలీ పోలీసులు మాట్లాడుతూ.. సెక్టార్ 77, SAS నగర్‌లో ఉన్న పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో చిన్నపాటి పేలుడు సంభవించింది. అయితే ఎటువంటి పాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం సీనియర్ అధికారులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలను సైతం పిలిపించారని తెలిపారు.
అయితే ఈ దాడి ఉగ్రవాదులు చేశారా లేక కార్యాలయంలోని పేలుడు పదార్థాల వలన జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే పంజాబ్ పోలీసులు టార్న్ తరణ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన తాజా ఘటనతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోలీసులను పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు.