విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి.
ఆ కథేంటో చూద్దాం..
కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి.
ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్‌లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్‌ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్‌లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్‌ఎస్‌వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్‌కు టీకా లేదు.
కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్‌ఎస్‌వీ డేంజర్‌గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్‌లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది.
అందుకే సడలించారా?
పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్‌ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్‌డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్‌ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు.
స్కూలుకు పోవచ్చా?
చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్‌లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది.
మూడు అడుగుల దూరం!
టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్‌లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు.
చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్‌లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
–సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment