ముంబై: దేశంలో లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటడంతో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫేక్ న్యూస్ నెట్టింట విహంగ వీక్షణం చేస్తోంది. దీని ప్రకారం.. పెట్రోల్ రేటు తగ్గాలంటే మోదీకి ఓటేయొద్దని ముంబైలోని సాయి బాలాజీ పెట్రోలియం బంక్ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాక వాహనదారులకు ఇచ్చే రశీదులో మరోసారి మోదీకి ఓటేసి భంగపాటుకు గురి కావద్దని పిలుపునిస్తోంది. ఈ రశీదుకు సంబంధించిన ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పలువురు వీటిని తిరిగి షేర్ చేస్తున్నారు.
కానీ కంటికి కనిపించేదంతా నిజం కాదు అన్నట్లుగా పైన కనిపిస్తుంది పెట్రోల్ బంకులో ఇచ్చిన బిల్లు కానే కాదట. హెచ్‌పీసీఎల్(హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఈ ఫేక్ ఫొటోపై స్పందిస్తూ ఇది సరైన ఫార్మాట్‌లో లేదని, ఇది నకిలీ బిల్లు అని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫేక్ బిల్లు పక్కన రియల్ బిల్లు ఫొటోలను పెట్టి షేర్ చేసింది. ఇక ఆ నకిలీ బిల్లు ఫొటోను తరచి చూస్తే అది 2018లోది అని తెలుస్తోంది. మరో ముఖ్య విషయమేంటంటే ఆ బిల్లు మీద హెచ్‌పీ లేదా హెచ్‌పీసీఎల్‌కు బదులుగా హెచ్‌పీఎల్ అని తప్పుగా రాసి ఉంది. పైగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో సాయి బాలాజీ పెట్రోలియం బంకే లేదట. కాబట్టి ఇదో శుద్ధ ఫేక్ న్యూస్. మోదీకి వ్యతిరేక ప్రచారం చేసేందుకు దీన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment