సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా పరిశ్రమల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లకు వారితో పాటే వ్యాక్సిన్‌లు వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారితోపాటు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయాలని వచ్చిన విజ్ఞప్తులపై సమీక్ష జరిపి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారి కోసం ఆయా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆసుపత్రులే వ్యాక్సిన్లను సేకరించాలని తెలిపారు.
ఈ మేరకు శనివారం కేంద్రం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 సంవత్సరాలు పైబడిన వారి కోసం కేంద్రం రాష్ట్రాలకు అందించే కోటా నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. అదే క్రమంలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రం వ్యాక్సిన్ తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన కోటా నుంచి ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment