న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినందుకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అహ్మదాబాద్(గుజరాత్) పోలీసులు. మోదీ హఠావో.. దేశ్ బచావో అంటూ రాతలు ఉన్న ఆ పోస్టర్లను ఆ వ్యక్తులు అహ్మదాబాద్‌లోని పలు చోట్ల అంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతంపై అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇక.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోస్టర్ల ప్రచారం చేపట్టగా.. ఆ మరుసటిరోజే ఈ అరెస్టుల పర్వం మొదలవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ హఠావో.. దేశ బచావక్ష పేరుతో మొత్తం పదకొండు భాషల్లో(గుజరాతీ, పంజాబీ, తెలుగు, పంజాబీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ)లో ఈ పోస్టర్ల ప్రచారం చేపట్టింది ఆప్.
ఇదిలాఉంటే.. గతవారం దేశరాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీనిపై 49 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ ప్రెస్‌లకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారట. మొత్తంగా బుధవారం ఒక్కరోజే మోదీ వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంపై 138కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఓవైపు పోలీసులు ఈ అరెస్టులపై స్పందించారు. పబ్లిక్ ప్రాపర్టీలను పాడు చేయడంతోపాటు సదరు పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన పేరు, అడ్రస్, ఇతర వివరాలను పొందుపర్చలేదని.. అందుకే చట్టం ప్రకారం వాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఈ పరిణామంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బ్రిటిష్ కాలంలో ఇలాంటి నిరసనలు తెలిపినా.. వాళ్లు స్వాతంత్ర ఉద్యమకారులపై కేసులు పెట్టలేదని అన్నారు. భగత్ సింగ్ నాడు స్వయంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. కానీ, ఏనాడూ ఆయనపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. వందేళ్ల కిందట వ్యతిరేక పోస్టర్ల వ్యవహారంలో బ్రిటిషర్లు కూడా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కానీ, ఇవాళ ఒక్కరాత్రిలో ప్రధానిపై పోస్టర్లు వేశారని 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అమాయకుల్ని అరెస్ట్ చేశారు. దేశంలో అసలేం జరుగుతోంది. ప్రధాని ఆరోగ్యం సక్రమంగానే ఉందా?. మోదీ హఠావో.. దేశ్ బచావో అనే పోస్టర్ల క్యాంపెయిన్ అసలు పెద్ద అంశమేనా?. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఆయన(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) అభద్రతా భావంలోకి కూరుకుపోతున్నారు. బహుశా సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదేమో. అదే నిజమైతే మంచి డాక్టర్‌కు చూపించుకోమని ఆయనకు చెప్పండి. చిరాకులో ఆయన ప్రతీ ఒక్కరినీ జైలులో వేసుకుంటూ పోతున్నారేమో. ప్రధాని ఆరోగ్యం బాగుండాలని నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment