మైసూరు: సమాజంలో అందరితో సమానంగా జీవించేందుకు అనేక హక్కులు సాధించుకున్న ట్రాన్స్‌జెండర్లు నైపుణ్యాలు పెంపొందించుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. మైసూరులోని జయనగర నివాసి శశికుమార్ అలియాస్ శశి ప్రస్తుతం ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు.
14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న ఈయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూరులోని అశోకపురంలో ఉన్న సిద్ధార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన శశి, మైసూరులో సైన్స్(పీసీఎంబీ) చదివారు. తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు.
చదువంటే ఎంతో ఇష్టం..
శశి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంతో మంది అవహేళన చేసినా ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రమించాను. ఫీజులు చెల్లించేందుకు డబ్బు లేక పలువురి ఇళ్లలో పని చేశాను. తోటి విద్యార్థుల వద్ద కూడా అవమానాలు ఎదుర్కొన్నా. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంచకర్మ వైద్యురాలు డాక్టర్ జే.రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకారం అందించారు. మున్ముందు న్యాయమూర్తిగా ఎదగాలనేది నా ఆశయం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment