
జీడీపీలో 4.9 శాతానికి డౌన్
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9 శాతానికి పరిమితం చేయాలని పూర్తిస్థాయి బడ్జెట్ నిర్దేశించుకుంది.
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అంచనాలు 5.1 శాతం కన్నా తాజా లెక్కలు తక్కువగా ఉండడం గమనార్హం. రెవెన్యూ వసూళ్లు బాగుండడం దీనికి ప్రధాన కారణం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లు
వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లు
లోటు రూ.16.14 లక్షల కోట్లు
రుణాలు మినహా రిసిట్స్ రూ.32.07 లక్షల కోట్లుగా ఉంటుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా పేర్కొంది. రిసిట్స్ విషయంలో నికర పన్ను వసూళ్ల లక్ష్యం రూ.25.83 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా. వెరసి ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం రూ.16.14 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్ అంచనా వేసింది. అంటే జీడీపీ అంంచనాల్లో ఇది 4.9 శాతమన్నమాట. తొలి అంచనా రూ.16.85 లక్షల కోట్లకన్నా ఇది తక్కువ.
‘‘2021లో నేను ప్రకటించిన ఆర్థిక స్థిరత్వ బాట మన ఆర్థిక వ్యవస్థకు బాగా ఉపయోగపడింది. వచ్చే ఏడాది లోటును 4.5 శాతం కంటే తక్కువకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉంది. 2026–27 నుండి ప్రతి సంవత్సరం ద్రవ్య లోటును పూర్తి కట్టడిలో ఉంచడానికి మా ప్రయత్నం ఉంటుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ అప్పులు జీడీపీతో పోల్చితే క్షీణరేటు మార్గంలో కొనసాగుతాయి’’ అని ఆర్థికమంత్రి అన్నారు.

తగ్గిన మార్కెట్ రుణ లక్ష్యం...
ద్రవ్యలోటు కట్టడి లక్ష్య సాధనకు స్థూల మార్కెట్ రుణ పరిమాణాన్ని కూడా రూ.12,000 కోట్లు తగ్గించడం కీలకాంశం. ఫిబ్రవరినాటి రూ.14.13 లక్షల కోట్ల అంచనాను తాజాగా రూ.14.01 లక్షల కోట్లకు బడ్జెట్ తగ్గించింది. డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సమీకరించే స్థూల, నికర మార్కెట్ రుణాలు వరుసగా రూ. 14.01 లక్షల కోట్లు, రూ.11.63 లక్షల కోట్లకు చేరుతాయి. ఈ రెండు సంఖ్యలూ 2024 ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ అంచనాకన్నా తక్కువ కావడం గమనార్హం. 2023–24లో స్థూల మార్కెట్ రుణ పరిమాణం రూ.15.43 లక్షల కోట్లు.
‘ప్రత్యేక సాయం’తో రాష్ట్రాభివృద్ధికి ఊతం
కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కు ప్రకటించిన ‘ప్రత్యేక సాయం’వల్ల రాష్ట్రాభివృద్ధికి ఊతం లభిస్తుంది. గతంలో రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవడంతో ‘ప్రత్యేకహోదా’డిమాండ్ వచ్చింది. సాంకేతిక కారణాలవల్ల బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలుకాని పక్షంలో ఏదోరకంగా ప్రత్యేకంగా సాయం ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం.
గతంలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సమయంలో బిహార్‌కు తగిన నిధులు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. – నితీశ్‌కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
యువత, రైతుల విస్మరించారు
యువత, రైతుల ప్రయోజనాలను ఈ బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయఒత్తిళ్లకు తలొగ్గింది. అందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు మాత్రం ఉత్తిచేయి చూపించారు.
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బిహార్ సీఎం నితిశ్‌కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన మిత్ర పక్షాలు కావడంతో తమ రాష్ట్రాలకు నిధులకోసం ఒత్తిడి తీసుకువస్తున్నారు. – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment