సాక్షి, ముంబై: అంధేరీలోని గోఖలే వంతెన సాధ్యమైనంత త్వరగా కూల్చివేసి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని బీఎంసీ భావిస్తోంది. స్ధానికులు పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులకు 21 రోజుల్లో టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ పూర్తి చేయాలని బీఎంసీ భావిస్తోంది. 2023 మార్చి లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అంతేగాకుండా కూల్చివేత పనుల్లో చివరి ఘట్టం పూర్తి చేయడానికి 30 గంటలపాటు రైల్వే నుంచి బ్లాక్ తీసుకోనున్నట్లు బీఎంసీ పేర్కొంది. ఆ తరువాత నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టనుంది. 1975లో నిర్మించిన అంధేరీలో తూర్పు–పశ్చిమ ప్రాంతాలను కలిపే గోఖలే వంతెన శిథిలావస్ధకు చేరుకోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినప్పటికీ అవికూడా సరిపోవడం లేదు. దీంతో కూల్చివేత పనులు వేగవంతం చేసి కొత్త వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని బీఎంసీ నిర్ణయించింది.
ఎంత వ్యయం? ఎవరి బాధ్యత?
గోఖలే వంతెన ఎవరు నేల మట్టం చేస్తారు..? ఎవరు నిర్మిస్తారనే ప్రశ్న స్ధానిక ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు కూల్చివేయాలి...? ఎవరు నిర్మించాలి...? అందుకయ్యే వ్యయంలో ఎవరు, ఎంత శాతం నిధులు వెచ్చించాలి..? ఇలాంటి కారణాలు తెరమీదకు వచ్చాయి. ఇదివరకు నేలమట్టం చేసిన అనేక వంతెనల పనులు జాప్యం జరగడానికి ఇవే ప్రధాన కారణాలయ్యాయి. దీంతో ఈ వంతెన రైల్వే హద్దులో ఉన్న పనులు పశ్చిమ రైల్వే చేపట్టనుంది. బీఎంసీ హద్దులో ఉన్న పనులు బీఎంసీ చేపట్టనుంది. కాని రైల్వే ట్రాక్స్ మీదున్న వంతెన భాగాన్ని కూల్చివేయాలంటే కూలీలకు ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం.
ఓవర్ హెడ్ వైర్‌లోంచి 25 వేల ఓల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుంది. వంతెన కిందున్న ఆరు రైల్వే మార్గాల మీదుగా సగటున రెండు నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ వంతెన నేలమట్టం చేయాలంటే ఇటు ఇంజినీర్లకు, అటూ కూలీలకు కత్తిమీద సాములంటిదేనని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమీత్ ఠాకూర్ పేర్కొన్నారు.
కూల్చివేత పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కంట్రాక్టర్లకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాధారణంగా గోఖలే వంతెన వినియోగంలో ఉన్నప్పుడే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ వంతెన మూసి వేయడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా స్ధానికులు విసిగెత్తిపోయారు. రోడ్డు మార్గం కంటే లోకల్ రైలు లేదా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment