
బనశంకరి: నువ్వెంత అంటే, నువ్వెంత అని ఆరోపణలు చేసుకుని అమీతుమీకి సిద్ధమైన ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ రూపాను బదిలీచేసి, ఆ పోస్టులో ఐఏఎస్ భారతిని సర్కారు నియమించింది. దేవాదాయశాఖ కమిషనర్ పోస్టు నుంచి రోహిణిని బదిలీ చేసి ఆ స్థానంలో హెచ్.బసవరాజేంద్రను నియమించింది. రూప, రోహిణికి ఎలాంటి పోస్టులు లేకుండా వెయిటింగ్‌లో ఉంచడం గమనార్హం.
ఐపీఎస్ రూప భర్త బదిలీ
ఇక ఐపీఎస్ రూప భర్త మౌనీశ్ మౌద్గిల్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన ప్రస్తుతం సర్వే, భూరికార్డుల శాఖ కమిషనర్‌గా ఉండేవారు. తాజా గొడవల నేపథ్యంలో ఆయనకు కూడా బదిలీ తప్పలేదు. సిబ్బంది పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు స్థానభ్రంశమైంది. ఆయన పోస్టులో సర్వేశాఖ అదనపు డైరెక్టర్ గా ఉన్న సీఎన్.శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ బదిలీల్లో భాగంగా పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న ఐఏఎస్ హెచ్‌వీ.దర్శన్ ను తుమకూరు మహానగర పాలికె కమిషనర్‌గా నియమించింది.
ఘాటుగా నోటీసులు
ఇద్దరు మహిళా అధికారుల విభేదాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఉభయులకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ సూచనమేరకు నోటీసులు అయ్యాయి. హద్దుమీరి ప్రవర్తించరాదని అందులో హెచ్చరించారు. ఆరోపణలు చేసుకోవడం స రీ్వస్ బంధనల ఉల్లంఘన కు పాల్పడినట్లు అవుతుంది, బహిరంగంగా మాట్లాడరాదు, ఒకవేళ మళ్లీ మాటల యుద్ధానికి దిగితే కఠినచర్యలు తీసుకుంటామని నోటీస్‌లో పేర్కొన్నారు. మీ ఆరోపణలను ప్రభుత్వం ముందు పెట్టవచ్చు, ఇకపై మీడియా ముందుకు వెళ్లరాదని నోటీసుల్లో సిబ్బంది, పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జేమ్స్ తారకన్ పేర్కొన్నారు.
రూపపై కేసు నమోదుపై మీమాంస
రోహిణి సింధూరి భర్త సుదీర్‌రెడ్డి ఐపీఎస్ రూపాపై బాగలగుంటె పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తన భార్య ఫోన్‌ను హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుపై పోలీసులు న్యాయ నిపుణులతో సంప్రదించారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేయించాలని రోహిణి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు.
కేబినెట్ భేటీలో చర్చ
సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రూపా– రోహిణి రగడ గురించి కొందరు మంత్రులు లేవనెత్తారు. ముఖ్యమంత్రి బొమ్మై సైతం తీవ్రంగా పరిగణించి వారిని బదిలీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం రూపా ఫేస్‌బుక్ ద్వారా ఆరోపణలు చేయడం, అందుకు రోహిణి ఘాటుగా బదులివ్వడం, సోమవారం వివాదం విధానసౌధకు చేరి ఇద్దరూ మీడియా ముందు అక్కసు వెళ్లగక్కడంతో వేడెక్కింది. మంగళవారం ఇరువర్గాలూ మౌనం దాల్చడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది.