వివాహం అయిన మహిళకు మంగళ సూత్రం, నల్లపూసలు, సింధూరం, మెట్టెలు తప్పని సరి. ఈ సాంగ్యాలు వివాహితను, పెళ్లికాని స్త్రీని వేరు చేస్తాయి. మరి ఒక పురుషుడు వివాహితుడో కాదో తెలియడం ఎలా. తాను వివాహితుడనని తెలియజేయడానికి పురుషుడు ప్రత్యేకంగా ఏం ధరించడు. ఎందుకు అంటే కారణాలు వారే చెప్పాలి. దీని సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ వివాహంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
వివాహ సమయంలో వధువుతో పాటు వరుడు కూడా పెళ్లి కుమార్తె చేత తాళి కట్టించుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త కొందరు మగ మహానుభావులను కలవర పెడుతుండగా చాలా మంది మాత్రం సదరు పెళ్లి కుమారుడిని ప్రశంసిస్తున్నారు. ఈ అరుదైన పెళ్లి ముచ్చటను హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ స్టోరి తెగ వైరలవుతోంది.
ఆ వివరాలు.. శార్దుల్, తనుజా ఒకే కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నామని తెలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరు అభ్యుదయ భావాలు కల వ్యక్తులు. ఆడ, మగ సమానం అని తనుజ భావిస్తే.. మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని భావించే వ్యక్తి శార్దుల్. హార్డ్‌కోర్ ఫెమినిస్ట్ అయిన శార్ధుల్‌పై మనసు పారేసుకుంది తనుజ. ఇద్దరు వివాహం చేసుకోవాలని భావించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు.
ఇరువురు మంగళసూత్రాలు మార్చుకోవాలని నిర్ణయం...
కోవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే శార్దుల్ తన మనసులోని మాట వెల్లడించాడు. ఆగ, మగ ఇద్దరు సమానం అయినప్పుడు కేవలం స్త్రీ మాత్రమే ఎందుకు మంగళసూత్రం ధరించాలి అని ప్రశ్నించాడు. పెళ్లి నాడు తనుజ మెడలో తాను, తన మెడలో ఆమె తాళి కట్టాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి కుటుంబ సభ్యులకు చెప్తే వద్దంటారనే ఉద్దేశంతో పీటల మీదకు వచ్చే వరకు ఎవరికి తెలపలేదు.
ఇక పూజారి మంగళసూత్ర ధారణ చేయమని చెప్పినప్పుడు శార్దుల్ తన నిర్ణయాన్ని తెలిపాడు. దీనికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కొందరు బంధువులు మండపం నుంచి వెళ్లిపోయారు. కాకపోతే ఎలాంటి గొడవ జరగకుండా పెళ్లి తంతు పూర్తయ్యింది. తనుజ మెడలో శార్దుల్.. ఆమె మెడలో అతడు మంగళసూత్రం కట్టారు. ఈ అనూహ్య సంఘటన గురించి ఓ న్యూస్ వెబ్‌సైట్ ప్రచురించడంతో ఇది తెగ వైరలయ్యింది. తాజాగా మరోసారి హ్యూమన్స్ బాంబే వారు దీన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో మరో సారి వైరల్ అయ్యింది.
చీర కట్టుకో.. పిరియడ్స్ తెచ్చుకో
ఈ పెళ్లి వార్త గురించి తెలియగానే చాలా మంది శార్దుల్ మీవ విరుచుకుపడ్డారు. మగాడిగా పుట్టి ఇలాంటి సిగ్గు మాలిన పని చేస్తావా.. ఇంకేందుకు ఆలస్యం ఓ చీర కట్టుకో.. ప్రతి నెల నీ భార్యతో పాటు పిరియడ్స్ కూడా తెచ్చుకో అంటూ విమర్శించారు. కానీ చాలా మంది మాత్రం శార్దుల్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం, అంతకుమించి ఆడవారి పట్ల గౌరవం ఉండాలి.. ఫెమినిస్ట్‌నని మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
చదవండి: వధువు కాళ్లకు నమస్కరించిన భర్త
Comments
Please login to add a commentAdd a comment