అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది.
2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’
Comments
Please login to add a commentAdd a comment