ఈరోజు(ఆదివారం) గురుపౌర్ణమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేడుకలు నిర్వహిస్తున్నారు. యూపీలోని వారణాసికి పెద్దసంఖ్యలో చేరుకున్న భక్తులు గంగాఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అధికార యంత్రాంగం ఘాట్‌ల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేసింది. యూపీలోని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీర్జాపూర్, ఘాజీపూర్, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సనాతన సంప్రదాయంలో గురుపౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయిబాబా కొలువైన మహారాష్ట్రలోని షిర్డీలో జరుగుతున్న గురుపౌర్ణమి వేడుకలకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గురుపౌర్ణమి సందర్భంగా సాయినగరి షిర్డీ భక్తులతో కిటకిటలాడుతోంది. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయిబాబా సంస్థాన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది.
శనివారం తెల్లవారుజామున కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తరువాత సాయి జీవిత చరిత్ర పుస్తకాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజంతా సాయి మందిరాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment