
ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్ నృత్య ప్రదర్శన జరిగింది.
మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణిస్తూ సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు.
ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్ నెస్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల బృందం పాల్గొన్నారు.
ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు
ఈ కార్యక్రమంలో రాజేష్ శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం, నైనా శిష్య బృందాలు (భరత నాట్యం), భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం), హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం), మిత్ర శిష్యబృందం (మణిపురి), ప్రగ్య , దిపన్విత శిష్యబృందాలు (కథక్)లు ప్రదర్శించారు.
గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది.