సత్సంగ్ నిర్వహణలో బాబా అనుచరుల నిర్లక్ష్యం
121కి చేరిన మృతుల సంఖ్య
పరారీలోనే భోలే బాబా
హత్రాస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా ఫూల్‌రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరుకుంది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్ మధుకర్‌తోపాటు ఇతరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. భోలే బాబా పేరును ఇంకా చేర్చలేదు. 80 వేల మందికే అనుమతి ఉంటే 2.5 లక్షల మంది వచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు స్పష్టం చేశారు.
సాక్ష్యాధారాలు దాచిపెట్టేందుకు నిర్వాహకులు ప్రయతి్నంచారని ఆరోపించారు. అనుమతి తీసుకొనే సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తొక్కిసలాటలో పోలీసుల తప్పిదమీమీ లేదని స్పష్టం చేశారు. ఫూల్‌రాయ్‌లో తొక్కిసలాటకు కారణమైన బాబా నారాయణ్ హరి అలియాస్ సకర్ విశ్వ హరి భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 121 మంది మృతుల్లో 117 మందిని గుర్తించారు. గాయపడ్డ 28 మందికి చికిత్స కొనసాగుతోంది. సత్సంగ్ టెంట్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెప్పులు దుర్ఘటనకు మౌనసాక్షిగా నిలిచాయి.
జ్యుడీషియల్ విచారణ: యోగి
తొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వలో జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దుర్ఘటన వెనుక కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని ఆయన బుధవారం పరామర్శించారు. ఘటనా స్థలాన్నీ్న పరిశీలించారు.
బాబా మంచోడు: గ్రామస్తులు
భోలే బాబా మంచోడని యూపీలో కాస్‌గంజ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బహదూర్‌నగర్ వాసులు చెబుతున్నారు. బాబా తమను ఏనాడూ చందాలు గానీ, కానుకలు గానీ అడగలేదని గ్రామస్థులు చెప్పారు. బహదూర్‌నగర్ సమీపంలో భోలేబాబాకు ఒక ఆశ్రమం ఉంది. బాబా దంపతులకు సంతానం కలగలేదు. ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం ఆ బాలిక చనిపోయింది. ఆమె ప్రాణాలతో లేచివస్తుందన్న నమ్మకంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు
అంత్య క్రియలు నిర్వహించారు.
బాబా అనుచరుల వల్లే తొక్కిసలాట!
తొక్కిసలాటపై హత్రాస్ సబ్‌డివిజనల్ మేజి్రస్టేట్(ఎస్‌డీఎం) బుధవారం జిల్లా మేజి్రస్టేట్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న భోలే బాబాను దగ్గరగా చూసేందుకు, చేత్తో తాకేందుకు భక్తులు అరాటపడ్డారని, వారిని బాబా అనుచరులు దూరంగా తోసివేయడానికి ప్రయతి్నంచడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నేలంతా బురదగా ఉండడంతో జనం జారిపడ్డారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొన్నారు. కింద చిక్కుకున్నవారు ఉపిరాడక మృతిచెందారని నివేదికలో ప్రస్తావించారు. సత్సంగ్‌కు 2 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారని వివరించారు.
విద్రోహ శక్తులే కారణం
భోలే బాబా
లక్నో: సత్సంగ్ వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగిందంటూ భోలే బాబా బుధవారం ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటకు సంఘ విద్రోహ శక్తులే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో తానక్కడ లేనన్నారు. భక్తుల మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment