శివాజీనగర: ఏడీజీపీ చంద్రశేఖర్ ఒక బ్లాక్ మెయిలర్, క్రిమినల్, అతడు తోటి ఉద్యోగులకు రాసిన లేఖను చక్కగా తయారు చేశారు. సరైన సమయంలో దీనికి సమాధానం ఇస్తానని జేడీఎస్ నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆదివారం జేపీ నగర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడీజీపీ తన తోటి ఉద్యోగులకు రాసిన లేఖ గురించి స్పందిస్తూ, ఆయన చెప్పినట్లుగా నేను కేసుల్లో నిందితున్ని కావచ్చు, అయితే అతను అధికారి అనే హోదాలో ఉన్న క్రిమినల్. వరుస నేరాలకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి.
ఆయన చేతికింద పనిచేసే ఇన్‌స్పెక్టర్‌కు రూ. 20 కోట్లు డిమాండ్ పెట్టి చిక్కుకొన్నాడు. ఆ ఇన్‌స్పెక్టర్ ఈ అధికారి మీద ఫిర్యాదు చేశారు. తక్షణమే రూ.2 కోట్లు తీసుకురావాలని బ్లాక్‌మెయిల్ చేసింది ఇతను కాదా? అని దుయ్యబట్టారు. లోకాయుక్తకు గవర్నర్ రాసిన లేఖ ప్రభుత్వ సహకారమున్న ఒక టీవీ చానెల్‌కు లీక్ అయ్యింది, దానిని లీక్ చేసింది ఎవరు? అనేది అందరికి తెలుసునన్నారు. అయితే అది రాజ్‌భవన్ నుండే లీకేజీ అయ్యిందని, అక్కడి అధికారులను విచారించాలని చంద్రశేఖర్ పై అధికారులకు లేఖ రాశారు, అందుకే అతని దర్పం, నేపథ్యంపై తాను ఆధారాల సమేతంగా మాట్లాడుతున్నానని చెప్పారు.
నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి
తాను అడిగిన ప్రశ్నలకు ఐపీఎస్ చంద్రశేఖర్ సమాధానమివ్వాలి, అలా కాకుండా క్రిమినల్ మనస్తత్వంతో కూడిన అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి గురించి చెడుగా లేఖను విడుదల చేశారు, ఇందుకు ఏమి చేయాలి, ఆధారాలు, విషయం లేనిదే నేను మాట్లాడను. తాను శనివారం ఉదయం మీడియాతో మాట్లాడగానే, సాయంత్రం ఆ అధికారి ఎక్కడకి వెళ్లాడనేది తెలుసు. ఆయన లేఖను ఎవరు తయారు చేసిచ్చారు అనేది తెలుసని పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ ఉపయోగించిన భాష అతని సంస్కృతికి నిదర్శనం. అతడు ఏం మాట్లాడారు అనేది అందరికీ తెలుసు అని మండిపడ్డారు.
కుమార ఆధారాలివ్వాలి: డీసీఎం
కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి, ఏడీజీపీ చంద్రశేఖర్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా, ఇందులో ఆధారాలు ఏమున్నాయో కుమారస్వామి విడుదల చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నెలమంగలలో మాట్లాడుతూ కుమారస్వామికి విరుద్ధంగా కేపీసీసీ కార్యాలయంలో లెటర్‌ను తయారుచేసి లీక్ చేశారని ఆరోపించడం సబబు కాదన్నారు. కుమారస్వామి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. కేపీసీసీకి, ఏడీజీపీ చంద్రశేఖర్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. చంద్రశేఖర్ నన్ను కలిసింది, మాట్లాడిందీ లేనే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment