బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు భారీ వర్షాల ధాటికి అతలాకుతలమవుతోంది. శుక్రవారం సాయంత్రం కురిసిన వానకు వీధులన్నీ జలమయ్యమయ్యాయి. ఇక సౌత్ బెంగళూరులో వరద ధాటికి సుమారు 500 వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 300 ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇంటి పైకప్పు మీదకు చేరి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వరద కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అద్దంపట్టే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు శివారులోని హొసకొరెహళ్లిలో ఓ యువకుడు, 15 రోజుల చిన్నారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి విశ్వప్రయత్నం చేశాడు. పసిపాపను ఎత్తుకుని వరద నీటిని దాటుకుంటూ సురక్షితంగా తల్లి ఒడికి చేర్చాడు. (చదవండి: తల్లి ప్రేమ: బిడ్డను నోట కరుచుకుని..)
అంతేకాదు, వరద నీటిలో చిక్కుకున్న మరో చిన్నారిని కూడా రక్షించి పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రాణాలు పణంగా పెట్టి మరీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సదరు యువకుడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం శనివారం కూడా బెంగళూరుల రూరల్, బెంగళూరు అర్బన్, తుముకూర్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామ్‌నగర, హసన్, చిక్కమగళూరు, కొడుగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది వరదల ధాటికి కర్ణాటకలో 11 వేల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment