ఉత్తర భారతదేశంలో ఈవీ రామసామి నాయకర్ ‘పెరియార్’.. నాస్తికునిగా, హిందీ వ్యతిరేకిగా పేరొందారు. పెరియార్‌కు సంబంధించి ఇటువంటి పరిచయం తప్పు కానప్పటికీ, ఇది ఏకపక్ష భావన అనే వాదన కూడా వినిపిస్తుంటుంది.
పెరియార్ సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశానికి వచ్చి, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీలో నివసించాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఒక ఘటన పెరియార్‌ను నాస్తికునిగా మార్చివేసింది.
పెరియార్ 1879, సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. తండ్రి పేరు వెంకట్ నాయకర్. తల్లి పేరు చిన్న తాయమ్మాళ్ అలియాస్ ముత్తమ్మాళ్. పెరియార్ తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న వ్యాపారవేత్త. 1944 డిసెంబర్‌లో కాన్పూర్‌లో ఒక ప్రసంగంలో పెరియార్ స్వయంగా ఇలా అన్నారు.. ‘నా కుటుంబం సనాతన సంప్రదాయాన్ని పాటించే కుటుంబం. దేవాలయాలు, సత్రాలు నిర్మించి ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి పాటుపడిన కుటుంబం. మా కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు అందించారు. అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ నన్ను చాలా మంది విప్లవవాది, అతివాది అంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే.. మన సమాజంలో ఉండకూడని కొన్ని అంశాలపై నేను దాడి చేశాను’ అని పేర్కొన్నారు.
పెరియార్ జీవితంపై రాజ్‌కమల్ ప్రకాశన్ మూడు సంపుటాలుగా పుస్తకాలను ప్రచురించింది. పెరియార్‌కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇదే పెరియార్‌ను సన్యాసం దిశాగా తీసుకువెళ్లింది. పెరియర్ తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి, గంగా నది ఒడ్డున ఉన్న కాశీ (వారణాసి)కి చేరుకున్నారు. సన్యాసి అయినందున అక్కడి ధర్మశాలలో లభించే ఉచిత ఆహారం కోసం ఆశించారు.
అయితే అతనికి ఎక్కడా ఉచితంగా ఆహారం లభించలేదు. ఉచిత భోజన సౌకర్యం కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనని అక్కడున్నవారు పెరియార్‌కు చెప్పారు. కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించిన యువ పెరియార్‌కు ఒక ఆలోచన వచ్చింది. అంతే.. పెరియర్ బ్రాహ్మణ వేషం ధరించారు. జంధ్యాన్ని ధరించి, ఆహారం కోసం ధర్మశాలకు వెళ్లారు. అయితే ఇందుకు అతని మీసం అడ్డంకిగా మారింది.
పెరియార్ పుస్తకంలోని వివరాల ప్రకారం.. గేట్ కీపర్ పెరియార్‌ను లోపలికి రాకుండా ఆపడమే కాకుండా, రోడ్డుపైకి నెట్టివేశాడు. అప్పటికే లోపల భోజన కార్యక్రమం పూర్తికావడంతో, ఎంగిలి ఆకులను రోడ్డుపై పడేశారు. చాలా రోజులుగా ఆకలితో అలమటిస్తున్న పెరియార్ మరోమార్గం లేక ఆ ఎంగిలి ఆకుల్లో మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది. ఈ సమయంలో వీధి కుక్కలు కూడా ఆ ఆకులలోని ఆహారాన్ని తినడానికి ఎగబడ్డాయి. ఎంగిలి ఆహారం తింటున్నప్పుడు పెరియార్ దృష్టి ఎదురుగా గోడపై రాసిన అక్షరాలపై పడింది. ‘ఈ ధర్మశాల ముఖ్యంగా అత్యున్నత కులానికి అంటే బ్రాహ్మణులకు చెందినది. ఈ ధర్మశాలను తమిళనాడుకు చెందిన ధనిక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించారు’ అని రాసివుంది.
పెరియార్ మనసులో అకస్మాత్తుగా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి..‘ఈ ధర్మశాలను ఒక ద్రావిడ వ్యాపారవేత్త నిర్మించినప్పుడు, బ్రాహ్మణులు..ఇతర ద్రావిడులు ఇక్కడ ఆహారం తినకుండా ఎలా అడ్డుకుంటారు? బ్రాహ్మణులు క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ద్రావిడులతో సహా ఇతర వర్గాలను ఆకలితో చంపడానికే నిశ్చయించుకుని, కుల వ్యవస్థ పేరుతో ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడరా?' పెరియార్ మదిలో మెదిలిన ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు.
కాశీలో బ్రాహ్మణులు చేసిన అవమానం పెరియార్ హృదయాన్ని గాయపరిచిందని ఆ పుస్తకం వెల్లడించింది. ఇదే అతని మనసులో కుల వ్యవస్థపై తీవ్ర ద్వేషాన్ని రగిలేలా చేసింది. దీంతో కాశీ ఒక పవిత్ర నగరం అని అనడాన్ని పెరియార్ ఒక భ్రమగా భావించారు. కొంతకాలానికి సన్యాసాన్ని వదిలివేసి, కుటుంబ సభ్యులు చెంతకు చేరారు.
ఇది కూడా చదవండి: నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి..
Comments
Please login to add a commentAdd a comment