
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహా అంశం సుప్రీంకోర్టులో ఎటూ తేలడం లేదు. స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గత వారం రోజులుగా వాదనలు వింటోంది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.
స్వలింగ జంటలకు ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని స్పష్టం చేసింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, లేదా బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేగాక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత అంశంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగడమే కీలకమని అంగీకరిస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్ సీరియస్
స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత కల్పించకుండా.. వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ‘స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పార్లమెంటుకు వదిలిపెట్టాలన్న మీ (కేంద్రం) విజ్ఙప్తిని పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే అలాంటి జంటలకు భద్రత, సామాజిక సంక్షేమం ఎలా కల్పిస్తారు? అలాగే ఈ సంబంధాలు బహిష్కరించబడకుండా కేంద్రం ఏం చేయాలనుకుంటోంది’ అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. వచ్చే బుధవారం ఆ వివరణలతో కోర్టుకు రావాలని ఆదేశించారు.
అయితే స్వలింగ సంపర్కుల వివాహ అంశంపై చర్చ జరపడానికి పార్లమెంట్ ఏం న్యాయస్థానం కాదంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ‘ప్రభుత్వం వర్సెస్ న్యాయవ్యవస్థ’ సమస్యగా మార్చకూడదనిపేర్కొన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల మరుసటి రోజు సీజేఐ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: పులికి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు!
Comments
Please login to add a commentAdd a comment