same sex marriages
-
సమన్యాయ సంకటం
ధర్మం, న్యాయం వేరు... చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప, న్యాయస్థానాల పరిధిలోది కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చేందుకు నిరాకరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వెలువరించిన తీర్పు ఆ సంగతే తేల్చింది. ‘‘ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషించి, వ్యాఖ్యానించగలదు. అది అమలయ్యేలా చూడ గలదు’’ అని భారత ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను అనుమతించాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంటేననీ, అందుకు తగ్గట్టు ‘ప్రత్యేక వివాహ చట్టాన్ని’ (ఎస్ఎంఏ) సవరించే బాధ్యత పాలకులదేననీ అభిప్రాయపడింది. అయితే, ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలసి జీవించే హక్కుందనీ, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదనీ స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని గంపెడాశతో ఉన్న ఎల్జీబీటీక్యూ లకు ఇది అశనిపాతమే. హక్కులకై వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు. నిజానికి, స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జూలైలో సుప్రీమ్ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక తదుపరిగా స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం భావించింది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకొనే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లితండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా లబ్ధి లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఏప్రిల్‌లో పదిరోజులు ఏకబిగిన విచారణ జరిపి, మే 11న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం నాలుగు అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్ళిళ్ళ చట్టబద్ధత పార్లమెంట్ తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్ళి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే, పిల్లల దత్తత సహా స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై అయిదుగురు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. దాంతో, ధర్మాసనం 3–2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది. వివాహ వ్యవస్థ, స్వలింగ సంపర్కాలపై ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా 34 దేశాలు సమ లైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్ట బద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్ళి మినహా అనేక అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ వివాహ జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు సైతం 2015 నుంచి అందిస్తోంది. స్వలింగ సంపర్కం, లైంగిక తల విషయంలో ప్రపంచంలో మారుతున్న ఆలోచనా ధోరణులకు ఇది ప్రతీక. అందుకే, మన దగ్గరా ఇంత చర్చ జరిగింది. ఆ మాటకొస్తే, భిన్న లైంగికత అనేది అనాదిగా సమాజంలో ఉన్నదే. మన గ్రంథాల్లో ప్రస్తావించినదే. అందుకే, సాక్షాత్తూ సుప్రీమ్ ఛీఫ్ జస్టిస్ సైతం, ఇదేదో నగరాలకో, ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడనాడాలన్నారు. అందరి లానే వారికీ నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. ఇది గమనంలోకి తీసుకోవాల్సిన అంశం. స్వలింగ జంటల వివాహాలకు పచ్చజెండా ఊపనప్పటికీ, భిన్నమైన లైంగికత గల ఈ సము దాయం దుర్విచక్షణ, ఎగతాళి, వేధింపుల పాలబడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీమ్ అభిప్రాయపడింది. అందుకు కేంద్రం, రాష్ట్రాలు తగు చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకూ, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెళ్ళికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ, స్వలింగ జంటలకు ఒకింత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకొంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మన లోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శానస నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి. భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్న మాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమనేదీ కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెర తీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ, ఈ పెళ్ళిళ్ళకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కుల లాంటివి నిరాకరించడం ఎంత వరకు సబబు? మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ, బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు అనేకులు గనక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ, దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు, కేవలం లైంగికత కారణంగా కొందరిపై దుర్విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేయాలి. అందరూ సమానమే కానీ, కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా? -
స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహా అంశం సుప్రీంకోర్టులో ఎటూ తేలడం లేదు. స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గత వారం రోజులుగా వాదనలు వింటోంది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది. స్వలింగ జంటలకు ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని స్పష్టం చేసింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, లేదా బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేగాక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత అంశంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగడమే కీలకమని అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్ సీరియస్ స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత కల్పించకుండా.. వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ‘స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పార్లమెంటుకు వదిలిపెట్టాలన్న మీ (కేంద్రం) విజ్ఙప్తిని పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే అలాంటి జంటలకు భద్రత, సామాజిక సంక్షేమం ఎలా కల్పిస్తారు? అలాగే ఈ సంబంధాలు బహిష్కరించబడకుండా కేంద్రం ఏం చేయాలనుకుంటోంది’ అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. వచ్చే బుధవారం ఆ వివరణలతో కోర్టుకు రావాలని ఆదేశించారు. అయితే స్వలింగ సంపర్కుల వివాహ అంశంపై చర్చ జరపడానికి పార్లమెంట్ ఏం న్యాయస్థానం కాదంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ‘ప్రభుత్వం వర్సెస్ న్యాయవ్యవస్థ’ సమస్యగా మార్చకూడదనిపేర్కొన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల మరుసటి రోజు సీజేఐ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: పులికి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు! -
'సహజీవనం అనే మాటే వినలేదు.. అది మన సంస్కృతి కాదు..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు సహజీవనం గురించి తన జీవితంలో ఎప్పుడూ వినలేదని పేర్కొన్నారు. పైచదువుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే నగరాలకు పంపితే వారేమో లివ్ ఇన్ రిలేషన్ అంటూ తమకిష్టమైన వారితో కలిసి జీవిస్తున్నారని అన్నారు. అలాగే స్వలింగ సంపర్క వివాహలను కూడా నవనీత్ వ్యతిరేకించారు. ఈరోజుల్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని, అబ్బాయిలు అబ్బాయిలనే, అమ్మాయిలు అమ్మాయిలనే పెళ్లిచేసుకోవడం ఏంటి? అని వాపోయారు. సహజీవనం, స్వలింగ సంపర్క వివాహాలు మన సంస్కృతి, సంప్రదాయాలే కాదని నవనీత్ పేర్కొన్నారు. చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్ఫోన్లు సీజ్! -
స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. వీటిపై ఫిబ్రవరి 15లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొన్నారు. పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్‌గా అయినా వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. భారత్‌లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలపి సుప్రీంకోర్టే విచారిస్తానని చెప్పింది. చదవండి: 'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి.. -
'గే' వివాహాలకు చట్టబద్దతపై పిల్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం..
న్యూఢిల్లీ: స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నేడు (శుక్రవారం) విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్ కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. దీనిపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది. హైదరాబాద్ జంట సుప్రియో, అభయ్‌లు గత పదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఇద్దరు వైరస్ బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక ఇద్దరూ 2021 డిసెంబర్లో వేడుక నిర్వహించారు. ఆ సంబరాలకు పేరెంట్స్, ఫ్యామిలీతో పాటు మిత్రులు హాజరయ్యారు. పర్త్ పిరోజ్ మెహరోత్రా, ఉదయ్ రాజ్ అనే మరో జంట రెండో పిటిషన్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించకపోతే అది సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు.. -
అమెరికా వీసా కావాలంటే.. వారు పెళ్లి చేసుకోవాల్సిందే
న్యూయార్క్ : వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, ఐక్యరాజ్యసమితిలో విధులు నిర్వహిస్తున్న అవివాహితులైన స్వలింగ భాగస్వాములకు అమెరికా వీసా కఠినతరం అయింది. స్వలింగ భాగస్వాములు వీసా పొందాలంటే వారు ఖచ్చితంగా వివాహం చేసుకొని ఉండాలని నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. దీనికి సంబంధించిన పాలసీ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, ఐక్యరాజ్యసమితి ఉద్యోగుల్లో ఎవరైనా వివాహం కాని స్వలింగ భాగస్వాములు ఉంటే వారు ఈ ఏడాది చివరి వరకు వివాహమైనా చేసుకోవాలని లేదా దేశం వదిలి వెళ్లాలని స్పష్టమైనా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ఓ సర్క్యూలర్ కూడా వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ స్వలింగ సంపర్కానికి మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలను విధిస్తున్నారు. చాలా మంది స్వలింగ భాగస్వాములు వారి వారి దేశాల్లో ఇప్పటికే న్యాయ విచారణను కూడా ఎదుర్కుంటున్నారు. కొత్త నిబంధనలతో ఇప్పటికే అమెరికాలో దౌత్యవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో ఎంతమందిపై ఈ ప్రభావం పడనుందో తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాలో చట్టబద్ధంగా నివసించేందుకు గడువుతీరిన వలసదారులను వెనక్కి పంపేందుకు రంగం సిద్ధమైంది. వీసా పొడిగింపునకు, మార్పులు చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియ అక్టోబర్ 1(సోమవారం) నుంచే ప్రారంభమైంది. అయితే హెచ్–1బీ వీసాదారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా, ఉపాధి, శరణార్థులకు సంబంధించిన పిటిషన్లకు ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేయబోవట్లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్సీఐఎస్) స్పష్టతనిచ్చింది. -
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
-
సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర
మెల్బోర్న్: స్వలింగ వివాహాలకు ఇటీవల రూపొందించిన బిల్లు సభలో కార్యరూపం దాల్చడంతో ఆస్ట్రేలియాలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో లారెన్ ప్రైస్, అమీ లేకర్లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో లెస్బియన్ మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా లారెన్ ప్రైస్, అమీ లేకర్ల పేరు ఆస్ట్రేలియాలో మార్మోగి పోతోంది. సిడ్నీకి చెందిన ఈ జంట గత కొంతకాలం నుంచి పెళ్లి గురించి ఆలోచిస్తుంది. కాగా, స్వలింగ వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో వీరికి చట్టపరంగా మార్గం సుగమమైంది. దీంతో అధికారులకు సమాచారమిచ్చిన లారెన్ ప్రైస్, అమీ లేకర్లు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని నూతన విధానాలకు నాంది పలికారు. మరోవైపు మెల్బోర్న్కు చెందిన ఎమీ, ఇలైస్ మెక్‌డొనాల్డ్ లు అధికారికంగా గే మ్యారేజ్ చేసుకున్న తొలి జంటగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించగా, అందులో 16 దేశాలు యూరప్‌లోనే ఉండటం గమనార్హం. -
స్వలింగ వివాహాలకు పట్టం
సిడ్నీ : స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలా? వద్దా? అనే అంశంపై ఆస్ట్రేలియా సమాజం ఓటెత్తింది. 61 శాతం మంది ఆస్ట్రేలియన్లు స్వలింగ వివాహాలకు చట్టబద్దత ఇవ్వాలని తీర్పునిచ్చారు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ కేవలం 38.4 శాతం ఓట్లే పోల్ అయ్యాయి. దాదాపు రెండు నెలలు పాటు సాగిన సర్వేలో కోటి 27 లక్షల మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా అధ్యక్షుడు మాల్కోమ్ టర్నబుల్ మాట్లాడుతూ స్వలింగ వివాహాలకు మద్దతుగా తాను ఓటేసినట్లు చెప్పారు. కాగా, ఓటరు తీర్పుతో ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించనుంది. దీంతో క్రిస్మస్ పర్వదినం నాటికి స్వలింగ వివాహాలకు చట్టబద్దత వచ్చే అవకాశం ఉంటుంది. సర్వే ఫలితాలు వెలువడిన అనంతరం ఆస్ట్రేలియన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఇదిలావుండగా, స్వలింగ వివాహాం చేసుకునే వారి పెళ్లిళ్లకు సామగ్రి సరఫరా చేయాలా? వద్దా? అనే విషయాన్ని వ్యాపారులకు వదిలేసే వెసులుబాటును చట్టంలో చేర్చాలని కొందరు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
గే పెళ్లిళ్లకు తైవాన్ గ్రీన్ సిగ్నల్
తైపీ: ప్రపంచంలో గే (స్వలింగ) పెళ్లిళ్లు నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తైవాన్ ప్రజలు కూడా ఇప్పుడు అటువైపే అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని తైపీ, కవోసియుంగ్ నగరాల్లో ఇప్పటికే అక్కడక్కడ గే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే ఇంకా వాటికి అధికారికంగా గుర్తింపు రావాల్సి ఉంది. గే పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును ఇంకా ఆమోదించాల్సి ఉంది. వచ్చే జనవరిలో పార్లమెంట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 113 మంది సభ్యుల్లో 57 మంది సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. పాలకపక్ష డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ, ఇతర పార్టీలు మద్దతిస్తున్నందున బిల్లు ఆమోదంపొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. బిల్లు చట్లరూపం దాలిస్తే ఆసియాలో గే పెళ్లిళ్లను ఆమోదించిన తొలి దేశం తైవాన్ అవుతుంది. వాస్తవానికి గే మ్యారేజెస్‌ను అనుమతిచ్చే బిల్లును దేశ పార్లమెంట్లో 2005లోనే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అది పెండింగ్‌లో ఉంటూ వచ్చింది. 2013లో దానికి మళ్లీ కదలిక రావడంతో పార్లమెంట్ కమిటీ దాన్ని సమీక్షించింది. మళ్లీ అది పెండింగ్‌లో పడిపోయింది. గత మే నెలలో దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన త్సాయ్ ఇంగ్ వెన్, గే పెళ్లిళ్ల చట్టానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మళ్లీ బిల్లుకు కదలిక వచ్చింది. -
స్వలింగ వివాహాలకు అమెరికా కోర్టు ఓకే!
కాన్సాస్ రాష్ట్రంలో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దాంతో అక్కడున్న మొత్తం 50 రాష్ట్రాలలో ఇలా స్వలింగ వివాహాలను ఆమోదించిన 33వ రాష్ట్రంగా నిలిచింది. తమ రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్లను ఆమోదించవద్దంటూ అక్కడ కొంతమంది ప్రజలు చేసిన విజ్ఞప్తులను కోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులలో ఆంటోనిన్ స్కాలియా, క్లారెన్స్ థామస్ అనే ఇద్దరు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మిగిలిన వాళ్లంతా ఓకే చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో కూడా స్వలింగ వివాహాలను ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు బరాక్ ఒబామా గత నెలలో ప్రకటించడంతో అప్పటివరకు 26గా ఉన్న ఈ రాష్ట్రాల సంఖ్య 32కు పెరిగింది. ఇప్పుడు కాన్సాస్ 33వ రాష్ట్రం అయ్యింది. త్వరలోనే దక్షిణ కరొలినా రాష్ట్రం కూడా దీన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. స్వలింగ వివాహాలను రద్దు చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అక్కడి న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. దానిపై అప్పీలు జరగనుంది. -
బ్రిటన్ లో1,400 పైగా 'స్వలింగ' వివాహాలు!
లండన్: ఈ మధ్య కాలంలో బ్రిటన్ లో స్వలింగ సంపర్క (సేమ్ సెక్స్) జంటలు పెళ్లిళ్లతో ఒక్కటవుతున్నాయి. గత మార్చి నుంచి జూన్ వరకూ 1,400 స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు జరిగినట్లు ఆ దేశ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాల చట్టం ఆమోద ముద్ర పొందిన నాటి నుంచి అవి క్రమేపీ పెరుగుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇంగ్లండ్ , వేల్స్ లో స్వలింగ సంపర్కుల జంటలు అత్యధికంగా పెళ్లిళ్లు చేసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటున్నట్లు ఆ నివేదికలో స్పష్టమైంది. ఇందులో 44 శాతం మంది పురుషులుండగా, 56 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో 95 మంది స్వలింగ సంపర్కుల జంటలు ఒక్కటవ్వగా, ఏప్రిల్ లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 351కు చేరింది. మే నెలలో 465, జూన్ లో 498 మంది ఈ వివాహానికి మగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఈ పెళ్లిలో చేసుకున్న మహిళలు సగటు వయసు 37 సంవత్సరాలు ఉండగా, పురుషల సగటు వయసు 38 సంవత్సరాలుగా తేలింది.