ధర్మం, న్యాయం వేరు... చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప, న్యాయస్థానాల పరిధిలోది కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చేందుకు నిరాకరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వెలువరించిన తీర్పు ఆ సంగతే తేల్చింది. ‘‘ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషించి, వ్యాఖ్యానించగలదు. అది అమలయ్యేలా చూడ గలదు’’ అని భారత ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది.
స్వలింగ వివాహాలను అనుమతించాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంటేననీ, అందుకు తగ్గట్టు ‘ప్రత్యేక వివాహ చట్టాన్ని’ (ఎస్‌ఎంఏ) సవరించే బాధ్యత పాలకులదేననీ అభిప్రాయపడింది. అయితే, ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలసి జీవించే హక్కుందనీ, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదనీ స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని గంపెడాశతో ఉన్న ఎల్జీబీటీక్యూ లకు ఇది అశనిపాతమే. హక్కులకై వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు.
నిజానికి, స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జూలైలో సుప్రీమ్ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక తదుపరిగా స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం భావించింది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకొనే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లితండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా లబ్ధి లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఈ అంశంపై ఏప్రిల్‌లో పదిరోజులు ఏకబిగిన విచారణ జరిపి, మే 11న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం నాలుగు అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్ళిళ్ళ చట్టబద్ధత పార్లమెంట్ తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్ళి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే, పిల్లల దత్తత సహా స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై అయిదుగురు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. దాంతో, ధర్మాసనం 3–2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది.
వివాహ వ్యవస్థ, స్వలింగ సంపర్కాలపై ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా 34 దేశాలు సమ లైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్ట బద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్ళి మినహా అనేక అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ వివాహ జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు సైతం 2015 నుంచి అందిస్తోంది.
స్వలింగ సంపర్కం, లైంగిక తల విషయంలో ప్రపంచంలో మారుతున్న ఆలోచనా ధోరణులకు ఇది ప్రతీక. అందుకే, మన దగ్గరా ఇంత చర్చ జరిగింది. ఆ మాటకొస్తే, భిన్న లైంగికత అనేది అనాదిగా సమాజంలో ఉన్నదే. మన గ్రంథాల్లో ప్రస్తావించినదే. అందుకే, సాక్షాత్తూ సుప్రీమ్ ఛీఫ్ జస్టిస్ సైతం, ఇదేదో నగరాలకో, ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడనాడాలన్నారు. అందరి లానే వారికీ నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. ఇది గమనంలోకి తీసుకోవాల్సిన అంశం.
స్వలింగ జంటల వివాహాలకు పచ్చజెండా ఊపనప్పటికీ, భిన్నమైన లైంగికత గల ఈ సము దాయం దుర్విచక్షణ, ఎగతాళి, వేధింపుల పాలబడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీమ్ అభిప్రాయపడింది. అందుకు కేంద్రం, రాష్ట్రాలు తగు చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకూ, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
పెళ్ళికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ, స్వలింగ జంటలకు ఒకింత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకొంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మన లోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శానస నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి.
భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్న మాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమనేదీ కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెర తీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ, ఈ పెళ్ళిళ్ళకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కుల లాంటివి నిరాకరించడం ఎంత వరకు సబబు?
మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ, బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు అనేకులు గనక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ, దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు, కేవలం లైంగికత కారణంగా కొందరిపై దుర్విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేయాలి. అందరూ సమానమే కానీ, కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా?
సమన్యాయ సంకటం
Published Thu, Oct 19 2023 12:24 AM | Last Updated on Thu, Oct 19 2023 12:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment