Supreme Court Cancels MediaOne Channel Ban - Sakshi
Sakshi News home page

ఛానల్‌ బ్యాన్‌.. కేంద్రానికి షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Published Wed, Apr 5 2023 2:01 PM | Last Updated on Wed, Apr 5 2023 3:06 PM

Supreme Court Cancels MediaOne Channel Ban - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. మలయాళం న్యూస్‌ ఛానల్‌ ‘మీడియావన్‌’పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీడియావ‌న్ ఛాన‌ల్ వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉన్న‌ట్లు సీల్డ్ క‌వ‌ర్‌లో పేర్కొన్న కేంద్ర ప్ర‌భుత్వ వాద‌న‌ను ధ‌ర్మాస‌నం తప్పుపట్టింది. జాతీయ భద్రత పేరుతో పౌరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది. మీడియా వన్ ఛానెల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ లైసెన్స్‌ను  నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది.

భద్రతా కారణాల రీత్యా మీడియావన్‌ ప్రసారాలను నిలిపివేస్తూ, ఆ ఛానెల్‌ లైసెన్సును రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 31 ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడా సమర్థించింది. కాగా ఛానల్‌పై విధించిన నిషేధంపై మధ్యమం బ్రాడ్‌కాస్టింగ్‌ లిమిటెడ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్‌ వచ్చేంతవరకు ప్రసార లైసెన్స్‌ను పునరుద్ధరించకూడదన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  

దీనిపై గతేడాది మార్చిలో విచారణ చేపట్టిన అత్యున్నత ‍న్యాయస్థానం ఛానల్‌ నిషేధంపై  స్టే విధించింది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం మీడియా స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని తెలిపింది. ఈ కేసులో మీడియా సంస్థకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

కేవలం ఊహాగానాలను ఆధారంగా చేసుకుని పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను విధించకూడదని, దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని పేర్కొంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యమని గుర్తు చేసింది. ఛానల్‌ ప్రసారాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని గాలి మాటలతో చెప్పలేమని, దానికి సరైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మీడియావన్‌ లైసెన్సులను పునరుద్ధరించకుండా కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ సీల్డ్‌ కవర్‌లో డాక్యుమెంట్లు కేరళ హైకోర్టుకు సమర్పించడంపై సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇతర పక్షాలకు సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ప్రభుత్వానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, అన్ని దర్యాప్తు నివేదికలను రహస్యంగా ఉంచడం కుదరదని తెలిపింది. ఇది పౌరుల హక్కులు, స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశాలను బయటకు వెల్లడించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement