శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి! | Huge Crowd At Sabarimala Temple In Kerala | Sakshi
Sakshi News home page

Sabarimala: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కి!

Published Wed, Dec 13 2023 8:58 AM | Last Updated on Wed, Dec 13 2023 9:42 AM

Huge Crowd At Sabarimala Temple In Kerala - Sakshi

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. దర్శనం లేట్‌ అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం. 

వివరాల ప్రకారం.. శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతుండటంతో కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు.

మరోవైపు.. శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు. తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.

ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వెళ్లినట్టు సమాచారం. వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. 

ప్రత్యేక రైళ్లు..
ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement