
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా తేలిన ఆయన.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం తుది తీర్పును వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం సీనియర్ అటర్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు ఒక్క రూపాయి జరిమాన విధించింది. ఇక కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ప్రశాంత్ భూషన్ న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తన సీనియర్, న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ట్విటర్ వేదికగా ప్రకటించారు. (జరిమానా చెల్లించండి.. లేదంటే జైలుకే: సుప్రీంకోర్టు)
కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం విధించిన జరిమానాను అంగీకరించినట్లు వెల్లడిస్తూ.. తన సీనియర్‌తో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. కాగా తాను తప్పేమీ చేయలేదని, కోర్టుకు క్షమాపణ చెబితో తప్పు చేసినట్లు అవుతుందని ప్రశాంత్ భూషన్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే తీర్పు సందర్భంగా ప్రశాంత్ భూషన్‌పై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించకపోతే.. మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి జరిమానా చెల్లించేందుకు అతని అంగీకరించినట్లు తెలుస్తోంది. (క్షమాపణ కోరితే తప్పేముంది)