
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం ‘ఐసీఐసీఐ ఫౌండేషన్’ కిడ్నీ రోగులకు భారీ ఉరటనిస్తోంది. డయాలసిస్ కేంద్రాల్లో పేద రోగులకు నిరంతరాయంగా ఆపరేషన్లు జరిపేలా దిగుమతి చేసుకున్న అత్యాధునిక యంత్రాలను సేకరించి గుర్తించిన ఆసుపత్రులకు నాలుగేళ్ల వారంటీతో అందిస్తున్నట్లు ఐసీఐసీఐ ఫౌండేషన్ తెలిపింది.
పేదలకు ఉచిత డయాలసిస్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలోని 'ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం' కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫౌండేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 దిగుమతి చేసుకున్న డయాలసిస్ పరికరాలను దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలోని పలు ఆస్పత్రులకు వీటిని ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. 60 జిల్లాల పరిధిలో అందుబాటు ధరలకే చికిత్సలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. నాలుగేళ్ల వారంటీతో వీటిని అందించనున్నట్టు తెలిపింది.