రాష్ట్రానికి మరో వరుణ‘గండం’ ఎదురుకానుంది. ఇప్పటికే అల్పపీడనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు పంటనష్టం వాటిల్లింది. ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముప్పు రానుంది. వాయుగుండం కారణంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం స్పష్టంచేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఈనెల 18వ తేదీన తీరం దాటనుంది. ఫలితంగా మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు పువియరసన్ ప్రకటించారు.
దీని ప్రభావంతో చెన్నై సహా పలు జిల్లాల్లో 17,18 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయి. 17వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, సేలం, అరియలూరు, పెరంబలూరు, పుదు చ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. అలాగే 18వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్టై, కాంచీపురం, సేలం, ధర్మపురం, కృష్ణగిరి, కల్లకురిచ్చి, ఈరోడ్, కడలూ రు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చిరాపల్లి, విళుపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది.
అండగా ఉంటాం..
భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన వారికి అండగా ఉంటాం.. ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. చేతికొచ్చిన పంటను కోల్పోయిన వ్యవసాయ కుటుంబాలకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈశాన్య రుతువపనాల ప్రభావంతో సుమారు 15 రోజులపాటూ విరుచుకుపడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయని దీంతో జన జీవనం అతలాకుతలమై పోయిందన్నారు.
వర్షాలు అదుపులోకి వచ్చిన తరుణంలో ఏడుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో నియమించిన సర్వే బృందం ఈనెల 12వ తేదీన డెల్టా జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ బృందం సీఎంకు మంగళవారం సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సీఎం స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించినట్లు సీఎం చెప్పారు.
నీట మునిగిన పంటకు సంబంధించి.. నష్టపోయిన రైతులకు అవసరమైన మేరకు వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్నరోడ్లు, సైడు కాలువల మరమ్మతుల కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఇక చెన్నైలో బుధవారం నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తల దృష్ట్యా నగరానికి తాగునీటి సరఫరా చేసే చెంబరబాక్కం, పుళల్, పూండి చెరువుల నుంచి బుధవారం ఉపరితల నీటిని విడుదల చేశారు. వరద ముంపు బాధిత ప్రాంతాల పునరుద్ధరణ పనులు బుధవారంతో పూర్తవుతాయని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్‌సింగ్ బేడీ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment