న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.
పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్‌లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్‌లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. గుల్‌మార్గ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment