
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ విముక్తి కోసం అలుపెరుగని పోరుసల్పిన బంగ్లా ఉద్యమ వీరులను ప్రధాని మోదీ శ్లాఘించారు. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవడంతో బంగ్లాదేశ్ ఆవిర్భావం సాధ్యమైంది. ఈ విజయానికి సూచికగా భారత్‌లో ప్రతీ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. ‘ బంగ్లా స్వాతంత్య్ర కోసం పోరాడిన యోధుల త్యాగాలను, పాక్‌పై కదనరంగంలో యుద్ధం చేసిన భారత సైనికులను స్మరించుకుందాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. విజయ్ దివస్‌లో భాగంగా మోదీ గురువారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వీరులకు నివాళులర్పించారు. విజయానికి గుర్తుగా ఏడాదికాలంగా దేశమంతా చుట్టొచ్చిన నాలుగు విజయజ్యోతి(విక్టరీ టార్చ్)లను యుద్ధస్మారక జ్యోతిలో ప్రధాని విలీనం చేశారు. వీరులకు పార్లమెంట్ ఉభయ సభలు ఘన నివాళులర్పించాయి.
బంగ్లాతో మైత్రికే తొలి ప్రాధాన్యం: కోవింద్
బంగ్లాదేశ్‌తో మైత్రికే భారత్ తొలి ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. ఢాకాకు వెళ్లిన ఆయన గురువారం బంగ్లాదేశ్ విమోచన స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢాకాలో నేషనల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన విక్టరీ పరేడ్ కార్యక్రమంలో బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలతోపాటు కోవింద్ హాజరయ్యారు. విజయోత్సవ వేడుకల్లో భాగంగా భారత్, బంగ్లా వాయుసేనలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు చేసి అబ్బురపరిచాయి.
Comments
Please login to add a commentAdd a comment