అహ్మదాబాద్: 2020లో భూమి మీద చాలా వింతలు జరిగాయి. గతంలో ఎప్పుడూ చూడని ఓ కొత్త మహమ్మారి (కరోనా వైరస్) ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రజలను అడుగు బయటపెట్టనీయకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ (ఏకశిల రాయి) ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నిర్మాణాలను చూస్తూంటే.. గ్రహాంతర వాసులే ఈ పని చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద 'మిస్టీరియస్ మోనోలిత్' ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే.
ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. పార్కులో ఈ మోనోలిత్ ఏకశిలను ఎవరు నిర్మించారో తానెప్పుడూ చూడలేదని పార్కులో పనిచేసేవారు అంటున్నారు. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు. ‘సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాను" అని తోటమాలి తెలిపారు.
పార్కుకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మోనోలిత్ ఏకశిల ఫొటోలను షేర్ చేశారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా కనిపిస్తోంది. ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ ఏకశిలా పార్కులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ మోనోలిత్ ముందుగా అమెరికాలోని ఉటా ఎడారిలో గుర్తించబడింది. ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియా దేశాల్లో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment