న్యూఢిల్లీ: భారత్‌లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ ప్రయోగాన్ని వచ్చేవారమే చేపట్టబోతున్నారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 12–16 తేదీల మధ్య ఈ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మొత్తం ప్రయోగానికి ‘ప్రారంభ్ మిషన్’ అని నామకరణం చేశారు. విక్రమ్–ఎస్ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్–ఎస్ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు.
‘ఇన్–స్పేస్’ క్లియరెన్స్
దేశంలో అంతరిక్ష సాంకేతికరంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఇన్–స్పేస్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ప్రైవేట్ విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్–స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12–16 మధ్య ప్రయోగం చేపట్టే వీలున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రతినిధి శిరీష్ పల్లికొండ మంగళవారం తెలిపారు. ప్రారంభ్ మిషన్‌ను ఆరంభిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేస్తామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్‌కుమార్ చందన వెల్లడించారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి.
ఇదీ చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment