అమెరికా, బ్రెజిల్‌ కంటే వేగంగా భారత్‌లో..! | India Overtook US Brazil In Fastest 2 Million Mark Of Covid 19 Cases | Sakshi
Sakshi News home page

భారత్‌లో 22 లక్షల కేసులు.. అమెరికా, బ్రెజిల్‌ కంటే వేగంగా

Published Mon, Aug 10 2020 12:13 PM | Last Updated on Mon, Aug 10 2020 2:58 PM

India Overtook US Brazil In Fastest 2 Million Mark Of Covid 19 Cases - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లకు చేరువ(కోటీ తొంభై ఎనిమిది లక్షలు)కాగా .. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కోవిడ్‌ మరణాలు సంభవించాయి. ఇక కరోనా ప్రభావిత దేశాల్లో దాదాపు 5 మిలియన్‌ కరోనా కేసులతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌(3.04 మిలియన్‌), భారత్‌(2.22 మిలియన్‌) నిలిచాయి. అయితే వైరస్‌ విజృంభించిన తొలినాళ్ల నుంచీ అమెరికా, బ్రెజిల్‌తో పోలీస్తే భారత్‌లో అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత ఒక్కసారిగా కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోయింది. తొలి కేసు నమోదైన నాటి నుంచి ఐదు లక్షల మార్కు చేరుకోవడానికి 149 రోజుల సమయం పట్టగా.. మరో 20 రోజుల్లోనే ఆ సంఖ్య 1 మిలియన్‌కు చేరుకోవడం గమనార్హం. అయితే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్యలో మాత్రం తగ్గుదల నమోదు కావడం, రికవరీ రేటు పెరగడం భారత్‌కు సానుకూల అంశంగా పరిణమించింది.

తొలుత నెమ్మదిగానే
చైనాలోని వుహాన్‌ నగరంలో గతేడాది డిసెంబరులో తొలి సారిగా వెలుగు చూసిన ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు విస్తరించింది విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లో జనవరి 30న కేరళలోని త్రిసూర్‌లో తొలి కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఇక మార్చిలో తొలి కరోనా మరణం నమోదైన నేపథ్యంలో తొలుత జనతా కర్ఫ్యూ విధించి, మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.

ఈ క్రమంలో జనవరి 30 నుంచి జూన్‌ 26(149 రోజులు)వరకు కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. కోవిడ్‌ అత్యంత ప్రభావిత దేశమైన అమెరికాలో ఈ మార్కు చేరుకోవడానికి కేవలం 81 రోజులే పట్టగా.. బ్రెజిల్‌లో 96 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య హాఫ్‌ మిలియన్‌కు చేరింది. అయితే 10 లక్షల మార్కును చేరుకోవడంలో మాత్రం మూడు దేశాలు(అమెరికా- 17 రోజులు, బ్రెజిల్‌ 19, ఇండియా- 20) పోటీపడ్డాయనే చెప్పవచ్చు. (100 రోజుల లాక్‌డౌన్‌.. ఏం జరిగింది?)

ఆ తర్వాత సీన్‌ మారింది. భారత్‌లో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. పాజిటివ్‌ కేసుల పెరుగుదలలో అమెరికా, బ్రెజిల్‌లను వెనక్కి నెట్టి అత్యంత వేగంగా 2 మిలియన్‌ కేసుల దిశగా పరుగులు తీసింది. ఈ రెండు దేశాల(అమెరికా-43, బ్రెజిల్‌-27)తో పోలిస్తే అతితక్కువ సమయంలోనే (21 రోజులు) 20 లక్షల మార్కును చేరుకుంది. మొదటి దశలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో తీవ్ర స్థాయిలో కరోనా ప్రభావం చూపగా.. రెండో దశలో ఏపీ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అయితే కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగడం ఈ సంఖ్యపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు.


అప్పటితో పోలీస్తే మరణాల సంఖ్య తక్కువే!
మొదటి మిలియన్‌ కేసులకు దేశంలో 25 వేల మరణాలు సంభవించగా.. 20 లక్షల మార్కుకు చేరుకునే సమయంలో ఈ సంఖ్య 16 వేలకు పడిపోయింది. అంటే తొలుత 2.55 శాతంగా ఉన్న మరణాల రేటు.. క్రమంగా 2.06కి పడిపోయింది. అయితే కొన్ని రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఈ విషయంపై ఇప్పుడే పూర్తిస్థాయి అంచనాకు వచ్చే అవకాశం లేదు.

మరోవైపు భారత్‌లో కరోనా టెస్టింగ్‌ సామర్థ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు సరైన స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదని హైకోర్టులు మొట్టికాయలు వేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మొత్తంగా దేశంలో ప్రతీ పది లక్షల మందిలో కేవలం 16 వేల మందికి పైగా టెస్టులు నిర్వహిస్తుండగా.. పాజిటివిటీ రేటు 9 శాతంగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య మరింతగా పెరిగితే పాజిటివ్‌ కేసుల సంఖ్య త్వరలోనే 3 మిలియన్‌ మార్కుకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా దేశంలో వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. మొత్తంగా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,007 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 44,386 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 6,34,945 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement