సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా సంక్రమణతో దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,12,262 కొత్త కరోనా రోగులను గుర్తించారు. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో కేసులు నమోదుకాలేదు. కాగా, 24 గంటల్లో ఇంతటి భారీస్థాయిలో కొత్త కేసులు భారత్‌లో నమోదవడం ఇది రెండోసారి. గతంలో ఏప్రిల్ 30న 4,02,351 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లక్షలాది కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కు చేరింది. కోవిడ్ బారిన పడి గత 24 గంటల్లో మరో 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,30,168కు పెరిగింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 353 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 81.99 శాతానికి చేరుకుంది. పాజిటివిటీ రేటు 21.43గా నమోదైంది.
35.66 లక్షల యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య సైతం వేగంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 3,29,113 మంది కరోనాను ఓడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 1,72,80,844కు చేరింది. రోజూ నమోదైన కొత్త కరోనా కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398 కు పెరిగింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, రాజస్తాన్, బిహార్‌సహా 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 6.43 లక్షలు, కర్ణాటకలో 4.87 లక్షలు, కేరళలో 3.76 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 2.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 81.05% యాక్టివ్ కేసులు 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటిదాకా 16,25,13,339 కోవిడ్ టీకాలిచ్చారు. బుధవారం వరకు మొత్తంగా 29,67,75,209 కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. వీటిలో 19,23,131 శాంపిల్స్‌ను బుధవారం ఒక్కరోజులోనే పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment